- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కలెక్టర్ కార్యాలయం ముందు నుంచే ఇసుక ట్రాక్టర్లు రయ్ రయ్..
జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నుంచే పట్టపగలు ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతుండటం అధికార యంత్రాంగం పనితీరు పై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

దిశ, మహబూబ్‌నగర్ ప్రతినిధి: జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నుంచే పట్టపగలు ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతుండటం అధికార యంత్రాంగం పనితీరు పై ప్రశ్నలు లేవనెత్తుతోంది. మహబూబ్‌నగర్ పట్టణంలోని భూత్‌పూర్ రోడ్డుపై కలెక్టర్ కార్యాలయం ముందు నుంచే ఇసుకతో నిండిన రెండు ట్రాక్టర్లు ఒకదానిని మరొకటి ఛేజింగ్ చేసుకుంటూ అధిక వేగంతో రయ్ రయ్ మంటూ దూసుకెళ్తుండడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది.
జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా పలుమార్లు సమీక్ష సమావేశాల్లో సంబంధిత శాఖల అధికారులను కఠినంగా ఆదేశించినప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఒక ట్రాక్టర్‌కు నంబర్ ప్లేట్ సరిగా కనిపించనీయకుండా చేసి, అత్యంత రద్దీ ప్రాంతంలోనే నిర్భయంగా తిరుగుతుండటం అధికారుల పర్యవేక్షణ పై అనుమానాలకు తావిస్తోంది. అధిక వేగంతో దూసుకెళ్తున్న ఈ ట్రాక్టర్ల వల్ల రోడ్డు ప్రమాదాల ముప్పు పెరుగుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమ రవాణాకు పాల్పడుతున్న వాహనాలను వెంటనే స్వాధీనం చేసుకుని, బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నారు.






