మోడీ 3.0 పాలనలో అత్యధిక లబ్ది ఏపీకే.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2026-05-23 07:27:50  IST  )

మోదీ 3.0 పాలనలో ఏపీ, తెలంగాణలకు భారీగా నిధులు వస్తున్నాయని, తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని బండి సంజయ్ అన్నారు.

మోడీ 3.0 పాలనలో అత్యధిక లబ్ది ఏపీకే.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. మోడీ 3.0 పాలనలో దక్షిణ భారతదేశంలో కేంద్రం నుండి అత్యధిక ప్రయోజనాలు పొందుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. అందులో భాగంగా గత రెండేళ్లలో రూ.3 లక్షల కోట్లకుపైగా ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేసుకోగలిగామని, కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండటంవల్లే ఇది సాధ్యమైందన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం సైతం మోడీ ప్రభుత్వం గత 12 ఏళ్లలో 12 లక్షల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. తెలంగాణ ప్రజలు సైతం డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలనే భావనలో ఉన్నారని తెలిపారు. ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్‍లోని అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే ఆఫీసర్స్ క్లబ్ ఆడిటోరియంలో నిర్వహించిన ‘రోజ్ గార్’’ మేళా కార్యక్రమానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా 120 మంది అభ్యర్థులు ఉద్యోగ అపాయిట్ మెంట్ లెటర్లను అందుకున్నారు.

హేళన చేసినా పట్టించుకోలేదు:

10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలనే లక్ష్యంతో 2022 అక్టోబర్ 22న రోజ్‌గార్ మేళాను ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించినప్పుడు ఇది జరిగే పనేనా? అని చాలా మంది హేళన చేశారని వాటిని పట్టించుకోకుండా అవినీతి, పైరవీలు, దళారుల ప్రమేయం లేకుండా ఇప్పటి వరకు 11 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారని ఇది మోడీ కమిట్ మెంట్‍కు నిదర్శనం అన్నారు. 19వ విడత ద్వారా 47 ప్రాంతాల్లో రోజ్ గార్ మేళా ద్వారా మరో 51 వేల ఉద్యోగాల భర్తీ చేసి నియామక పత్రాలు అందించామన్నారు. గతంలో లీకేజీలు, పైరవీలకు, దళారుల ప్రమేయంతో ఉద్యోగాలిచ్చేవారు. మోడీ మెరిట్ ఆధారంగా అర్హులైన వారినే ఉద్యోగాలు వరిస్తున్నాయని చెప్పారు. రోజ్ గార్ మేళాను నిరంతరం కొనసాగించాలని భావిస్తున్నామని, కర్మయోగి పోర్టల్ ద్వారా కొత్తగా ఉద్యోగాలు పొందిన వారంతా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని కోరుతున్నానన్నారు.

తెలంగాణలో నిరుద్యోగ మార్చ్ నిర్వహించాం:

గతంలో నేను ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలోని పెద్ద ఎత్తున నిరుద్యోగులతో కలిసి ‘నిరుద్యోగ మార్చ్’ నిర్వహించిన సంగతి బండి సంజయ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీకి వెళ్లానని అక్కడ నిరుద్యోగులు పడుతున్న కష్టాలను కళ్లారా చూశానన్నారు.. రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలిచ్చే పరిస్థితి లేదని కేంద్రం మాత్రం క్రమం తప్పకుండా నిరంతరం ఉద్యోగాలను భర్తీ చేస్తోందన్నారు. మీరంతా సగర్వంగా గల్లా ఎగరేసుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలుగా బతకాలన్నారు. పైరవీల్లేకుండా మీరు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అవినీతికి తావులేకుండా నిజాయితీ, నిబద్దతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. క్రియేటివితో ఆలోచించి మీరు చేస్తున్న ఉద్యోగం ద్వారా ప్రజలకు మరింత సేవలందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. .

సప్తసూత్రాలు పాటించాలి

అమెరికా ఇరాన్, రష్యా ఉక్రెయిన్ యుద్దం వల్ల ప్రపంచమంతా సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. భారత్ దేశం సుస్థిరంగా ఉండాలంటే ప్రధాని నరేంద్రమోడీ సూచించిన సప్తసూత్రాలను కచ్చితంగా పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సప్తసూత్రాలను పాటిస్తూ మీరే చేసే పొదుపు... ఈ దేశ భవితకు మలుపు కానుందని చెప్పారు. దేశ సరిహద్దుల్లో ఎండ, వాన, మంచు తుఫాన్లను తట్టుకుని సేవ చేస్తున్న జవాన్లు ఎంత గొప్ప వారో... సప్త సూత్రాలను పాటించే వారు అంతే గొప్ప వారన్నారు. 1965లో 50 రోజులపాటు ఇండియా పాకిస్తాన్ యుద్దం... దేశంలో ఆర్ధిక, ఆహార సంక్షోభం... ‘‘ప్రతి రోజు ఒక పూట తిండి మానేయండి లేదా ఒక్క పూట ఉపవాసం ఉండండి’’అని పిలుపుకు అద్బుత స్పందన వచ్చింది. జై జవాన్ జై కిసాన్ నినాదంతో సైన్యం పరంగా ధ్రుఢంగా నిలిచింది. హరిత విప్లవం వైపు వేగంగా అడుగులు పడి ఆహార ధాన్యాల కొరత లేకుండా చేసుకోగలిగాం. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని మోదీగారి సప్త సూత్రాలను పాటించండి. విదేశీ వస్త్రాలను కొనకండి. స్వదేశీ వస్త్రాలకు ప్రాధాన్యత ఇవ్వండి. క్రియేటివితో ఆలోచించి దేశాన్ని సుసంపన్నంగా మార్చండి. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తెలుగు ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరుతున్నా...

తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని

దేశంలోని అన్ని రాష్ట్రాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నదే మోడీ లక్ష్యం అని అందుకోసం నిరంతరం కష్టపడుతున్నారని చెప్పారు. అందులో భాగంగా మోడీకి తెలుగు రాష్ట్రాలంటే ప్రత్యేకమైన అభిమానం ఉందని యూసీఎఫ్ కింద ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు 7 వేల 766 కోట్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం గత 12 ఏళ్లలో 12 లక్షల కోట్లు ఖర్చు చేసిందని మోడీగారి 3.0 పాలనలో ఏపీకి అత్యధిక నిధులిస్తోందన్నారు. రెండేళ్లలోనే 3 లక్షల కోట్లకుపైగా ప్రాజెక్టుల ప్రారంభించారు. కర్నూలు పర్యటనలో 13 వేల 430 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభించారు. అమరావతి రాజధాని అభివ్రుద్ధి పనులకు 58 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన. దక్షిణ భారత దేశంలో మోదీ 3.0 పాలనలో అత్యధిక ప్రయోజనాలు పొందుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు.

10 సెమీకండక్టర్ యూనిట్లు ప్రపంచాన్ని శాసించబోతున్నాయి: ప్రధాని మోడీ

Next Story