- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ జాగృతిలో మరో కీలక నేత చేరిక.. కండువా కప్పి ఆహ్వానించిన కవిత
తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ పార్టీని ప్రకటించడానికి ముహూర్తం ఖరారు చేయడంతో, రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాల నేతలు ఆమె వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ జాగృతిలోకి మరికొంతమంది కీలక నేతలు చేరారు. తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ సహకార సంఘం అధ్యక్షుడు తాటికొండ శ్రీనివాసచారి తన అనుచరులతో కలిసి సోమవారం తెలంగాణ జాగృతిలో చేరారు. హైదరాబాద్‌లోని జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవిత వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. సామాజిక వర్గాల ఆశయాల సాధనే లక్ష్యంగా తమ ప్రయాణం సాగుతుందని పేర్కొన్నారు.
ఏప్రిల్ 25న పార్టీ ప్రకటన..
వచ్చే ఏప్రిల్ 25న మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో జరగనున్న భారీ బహిరంగ సభలో కవిత తన కొత్త రాజకీయ పార్టీ పేరు, జెండా, విధివిధానాలను ప్రకటించనున్నారు. పార్టీ ఆవిర్భావానికి సమయం దగ్గర పడుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా చేరికలు ఊపందుకున్నాయి. ఇటీవల బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కూడా జాగృతిలో చేరి పార్టీ బలోపేతానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు. కొత్త పార్టీలో యువతకు, మహిళలకు పెద్దపీట వేయబోతున్నట్లు కవిత ఇప్పటికే స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ అవసరం ఉందని, ఆ లోటును జాగృతి భర్తీ చేస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ భారీ చేరికలతో తెలంగాణ రాజకీయాల్లో కవిత కొత్త పార్టీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏప్రిల్ 25న జరగబోయే సభ ద్వారా తన రాజకీయ వ్యూహాన్ని ఆమె ఎలా ఆవిష్కరిస్తారో వేచి చూడాలి.






