స్టేట్ పాలిటిక్స్‌లో ఆసక్తికర పరిణామం.. జగిత్యాలకు బయలుదేరిన కేటీఆర్

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-09 06:32:39  IST  )

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపటి క్రితం జగిత్యాలకు బయలుదేరారు. ఇటీవలే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సీనియర్ నేత జీవన్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి, పార్టీలోకి అధికారికంగా ఆహ్వానించనున్నారు.

స్టేట్ పాలిటిక్స్‌లో ఆసక్తికర పరిణామం.. జగిత్యాలకు బయలుదేరిన కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నేడు జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డిని ఆయన నివాసంలో కలవడానికి కేటీఆర్ హైదరాబాద్ నుంచి జగిత్యాలకు బయలుదేరారు.

ఘన స్వాగతం.. భారీ బైక్ ర్యాలీ

కేటీఆర్ రాకను పురస్కరించుకుని జగిత్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. జగిత్యాల శివారులో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి వందలాది బైక్‌లతో భారీ ర్యాలీగా కేటీఆర్‌ను జీవన్ రెడ్డి నివాసానికి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు సిద్ధమయ్యారు. కేటీఆర్ రాకతో జగిత్యాల పట్టణమంతా గులాబీ జెండాలు, ఫ్లెక్సీలతో నిండిపోయి గులాబీమయంగా మారింది. అయితే, ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డిని బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించేందుకే కేటీఆర్ ఈ పర్యటన చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కేటీఆర్ ఆయనతో ఫోన్‌లో చర్చలు జరపగా, నేడు ప్రత్యక్షంగా భేటీ అయి పార్టీలోకి అధికారికంగా ఆహ్వానించనున్నారు. ఈ భేటీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా పాల్గొననున్నారు.

ముగిసిన నిరీక్షణ.. కేడర్‌లో ఉత్సాహం

సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరబోతున్నారనే వార్తలతో జిల్లాలోని గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో జీవన్ రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించగా, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఏప్రిల్ 13న కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి అధికారికంగా గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.

వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదు.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Next Story