గిరిజన బంధుకు బ్రేక్.. ఎన్నికల హామీగానే మిగిలిపోనుందా?

by Disha Web Desk 2 |
గిరిజన బంధుకు బ్రేక్.. ఎన్నికల హామీగానే మిగిలిపోనుందా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆదివాసీలు, గిరిజనుల కోసం రాష్ట్రవ్యాప్తంగా గిరిజనబంధును త్వరలోనే తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వారం రోజుల క్రితం ప్రకటన చేశారు. భూమిలేని ఎస్టీలకు మాత్రమే ఈ స్కీమ్‌ను అమలుచేయనున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఏ జిల్లాల్లో ఎంత మంది భూమిలేని గిరిజనులు, ఆదివాసీలు ఉన్నారో లెక్క తేల్చడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకోసం జిల్లాల ఇన్‌చార్జి మంత్రుల అధ్యక్షతన కోఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు జీవో విడుదలైంది. కానీ ఈ జీవో చట్టపరిధికి లోబడి లేదని అభిప్రాయపడిన హైకోర్టు తదుపరి ఆదేశం వెలువడేంతవరకు మీటింగులు పెట్టవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 21కి వాయిదా వేసినందున అప్పటివరకూ గిరిజనబంధు స్కీమ్ కసరత్తుకు బ్రేక్ పడినట్లయింది. మునుగోడు అసెంబ్లీ బై పోల్ ఎన్నికల హామీగానే మిగిలిపోయింది. ఈలోపు మునుగోడు ఉప ఎన్నిక కోసం షెడ్యూలు విడుదలయ్యే అవకాశం ఉంది.

రాష్ట్రంలో పోడు భూముల సమస్య ఎనిమిదేళ్ళయినా పరిష్కారానికి నోచుకోకుండా పోయింది. ప్రస్తుతం పోడు సాగుచేస్తున్న భూములపై అటవీ, రెవెన్యూ శాఖల మధ్య అనేక వివాదాలు నెలకొన్నాయి. వీటిని తేల్చిన తర్వాత ఎంత మంది రైతులకు పట్టాలు ఇవ్వాలనేది ఖరారవుతుంది. ఇప్పుడు దీన్ని తేల్చడానికే రాష్ట్ర ప్రభుత్వం జీవో (నెం. 140)ని ఈ నెల 11న జారీ చేసింది. దీనికి చట్టబద్ధత లేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో ఎలాంటి మీటింగులు పెట్టుకోవద్దనే ఆదేశం వెలువడింది. దీంతో లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ అర్ధంతరంగా ఆగిపోయింది. హైకోర్టు నుంచి తదుపరి ఆదేశం వచ్చే వరకూ ఈ ప్రక్రియ ముందుకు సాగడానికి వీల్లేకపోవడంతో అర్హులైనవారి గుర్తింపు, పట్టాల పంపిణీ తదితరాలన్నీ నిలిచిపోయాయి.

ప్రస్తుతం పోడు చేస్తున్న ఆదివాసీ, గిరిజన కుటుంబాలెన్నో తేలిన తర్వాతనే గిరిజనబంధు స్కీమ్‌కు అర్హత పొందేవారి లెక్క తేలుతుంది. ఈ లెక్క తేలితేనే ప్రభుత్వం దీనిపైన కసరత్తు చేసి ఈ స్కీమ్ కోసం ఎంత ఖర్చవుతుంది, ఎంత మంది ప్రయోజనం పొందుతారు, ఆర్థిక వనరులను ఎలా సమకూర్చుకోవాలి తదితరాలన్నింటిపై స్పష్టత ఏర్పడుతుంది. కానీ అన్ని జిల్లాల్లో పోడు లెక్కలను తేల్చే ప్రక్రియకు ఆంక్షలు రావడంతో స్కీమ్‌పై తదుపరి కార్యాచరణ కూడా పెండింగ్‌లో పడినట్లయింది. ప్రతీ ఎన్నికల సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని ప్రకటిస్తూ ఉన్నది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతుబంధు స్కీమ్‌ను తెచ్చింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా దళితబంధును ప్రవేశపెట్టింది. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం కావడంతో గిరిజన బంధును ప్రకటించింది.

తాజాగా హైకోర్టు ఆంక్షలతో పోడు భూముల సమస్యపై అధ్యయనం ఎప్పుడు జరుగుతుందో, వివాదానికి పరిష్కారం ఎప్పుడు లభిస్తుందో, పట్టాలను ఎప్పుడు పంపిణీ చేస్తుందో, లబ్ధిదారుల సంఖ్య ఎంతగా తేలుతుందో... ఇవే ఇప్పుడు ఆదివాసీలు, గిరిజనుల మధ్య జరుగుతున్న చర్చలు. విపక్షాలు ఆరోపించినట్లుగానే గిరిజన బంధు ఒక ఎన్నికల హామీగానే మిగిలిపోయింది. ఎనిమిదేళ్ళుగా పోడు సమస్యను తేల్చకుండా నాన్చిన ప్రభుత్వం గిరిజన బంధును కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకూ సాగదీస్తుందనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. గతడాది డిసెంబరులో గిరిజనసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీని వేసిన ప్రభుత్వం పోడు భూములను గుర్తించి, దానిపై ఆధారపడుతున్న కుటుంబాల లెక్క తేల్చి పట్టాలు ఇవ్వాలనే టాస్క్ అప్పగించింది. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్, జగదీశ్వర్ రెడ్డి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

సమగ్ర సర్వే ద్వారా పోడు భూములను గుర్తించాలని సబ్ కమిటీకి ప్రభుత్వం సూచించింది. అటవీ భూములలో 2005 వరకు సేద్యం చేస్తున్న గిరిజన కుటుంబాలకు తలా 10 ఎకరాల చొప్పున సేద్యపు హక్కులు (యాజమాన్యపు హక్కులు కాదు) ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఇందుకోసం అటవీ చట్టానికి 2006లో సవరణలు చేసింది. ఒకవేళ గిరిజనేతరులు సాగుచేసుకుంటున్నట్లయితే కనీసం 75 సంవత్సరాలకు తగ్గకుండా ఆ అటవీ భూముల్లో సేద్యం చేస్తూ ఉండాలనే నిబంధన పెట్టింది. అప్పుడే ఆ భూములపై వారికి సేద్యపు హక్కులు దక్కుతాయని పేర్కొన్నది. ఆ ప్రకారం గ్రామ, సబ్ డివిజనల్, డివిజన్, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి అర్హుల నుంచి దరఖాస్తుల్ని స్వీకరించింది. రాష్ట్రంలో సుమారు 13 లక్షల ఎకరాలను 3.45 లక్షల మంది సాగుచేస్తున్నందు వారి నుంచి దరఖాస్తులు వచ్చాయి. క్యాబినెట్ కమిటీ పలుమార్లు భేటీ చర్చించినా లెక్కలు తేల్చలేదు.

రాష్ట్రానికి వచ్చిన దరఖాస్తులన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. దళితబంధును ప్రతి దళిత కుటుంబానికీ ఇస్తుండగా గిరిజనుబంధును మాత్రం భూమిలేని కుటుంబాలకు మాత్రమే అనే నిబంధన ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్న చర్చలు గ్రామాల్లో జోరుగా జరుగుతున్నాయి. దళితబంధును ప్రభుత్వ ఉద్యోగస్తులకూ వర్తింపచేస్తున్నప్పుడు గిరిజన బంధు విషయంలో ఎందుకు షరతులు పెడుతున్నదంటూ విమర్శలూ వస్తున్నాయి. ఒకవైపు పోడుభూముల సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ మరోవైపు గిరిజన బంధు స్కీమ్‌పై ప్రకటన మాత్రమే చేసి లబ్ధిదారులను గుర్తించకుండా నాన్చివేయడం వెనక ప్రభుత్వ చిత్తశుద్ధి అర్థమవుతున్నదంటూ అనుమానాలను వ్యక్తంచేశారు. మునుగోడు ఉప ఎన్నికతో పాటు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్టీ ఓట్ల కోసం ప్రభుత్వం చేసిన మోసపూరిత ప్రకటన అంటూ ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తాయి.

పోడు భూముల కటాఫ్ డేట్‌పైనా ఎస్టీల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. తొలుత పేర్కొన్నట్లుగా కటాఫ్ సంవత్సరాన్ని 2005 డిసెంబర్ కాకుండా 2018కి మార్చాలని, గిరిజనేతరులకు విధించిన 75 ఏళ్ల సాగుకాలాన్ని నిర్ధారించే నిబంధనను కూడా సరళతరం చేయాలని కేంద్రాన్ని ఇప్పటికే కోరినట్లు రాష్ట్ర మంత్రులు గుర్తుచేస్తున్నారు. గిరిజనులు మాత్రం 2005 వరకు రాష్ట్ర పరిధిలో ఉన్నదాని ప్రకారం హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రంపై నింద మోపడానికే కటాఫ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తున్నదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేంద్రం క్లీన్ చిట్ ఇవ్వనందునే రాష్ట్రంలో పోడు భూముల సమస్య పరిష్కారం కాలేదనే సాకుతో పట్టాల పంపిణీతో పాటు దానితో ముడిపడిన గిరిజనబంధు స్కీమ్‌ను పెండింగ్‌లో పెట్టే ఆలోచనను చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు.

గిరిజనులందరికీ గిరిజనబంధు ఇవ్వాలి

"రాష్ట్రంలోని గిరిజనులందరికీ గిరిజనబంధు ఇవ్వాలి. దళితబంధును దళితులందరికీ ఇచ్చినప్పుడు గిరిజనులకు నిబంధన ఎందుకు. భూమిలేనివారికే ఇస్తామనడం సమంజసం కాదు. ఆటవీప్రాంతంలో గిరిజనులకు అరఎకరం అయినా ఉంటుందని తెలిపారు. వారికి ఇవ్వమనడం సమజసం కాదని అన్నారు. అలాంటప్పుడు గిరిజనబంధు ఎందుకు?. పోడుభూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. 2005 డిసెంబర్ లోపు రాష్ట్ర పరిధిలోనే హక్కుల కల్పించే బాధ్యత ఉంటుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలి". = తెలంగాణ గిరిజనసంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆర్. శ్రీరాంనాయక్

Also Read : ఆ ఓటర్ల కోసం టీఆర్ఎస్ వేట.. సీఎం ఆదేశంతో రంగంలోకి దర్యాప్తు బృందాలు!

Also Read : మంత్రి జగదీశ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు.. రాజకీయం వద్దన్నందుకు రాద్ధాంతం


Next Story