- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: దోస్తీనా.. కుస్తీనా? ‘మున్సిపల్’ ఎన్నికలపై పార్టీలకు పొత్తుల సవాల్
మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు పొత్తుగా వెళ్తాయా? లేక ఒంటరిగానే బరిలోకి దిగుతాయా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల (Telangana municipal elections) సందడి మొదలైంది. ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు వేగవంతం చేసింది. ఇప్పటికే పార్టీలు, ఇండిపెండెంట్లకు కేటాయించే గుర్తులను ప్రకటించింది. ఓటర్ల జాబితానూ రిలీజ్ చేసింది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. రాష్ట్ర స్థాయిలో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. జిల్లాల నేతలతో మీటింగ్స్ నిర్వహిస్తూనే.. పరిశీలకులను నియమిస్తున్నాయి. అయితే పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు కావడంతో.. ప్రధాన పార్టీలు పొత్తుగా వెళ్తాయా? లేక ఒంటరిగానే బరిలోకి దిగుతాయా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
స్నేహమా.. సమరమా?
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) - సీపీఐ (CPI) కలిసి పోటీ చేశాయి. సీపీఐకి ఒక సీటు కేటాయించగా, కొత్తగూడెం ఎమ్మెల్యేగా కూనంనేని సాంబిశివరావు గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు వారి మధ్య సహృద్భావ వాతావరణంలోనే పొత్తు కొనసాగుతున్నది. అసెంబ్లీ, ఇతర సమావేశాల్లోనూ సీపీఐ.. కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతూనే వస్తున్నది. మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఈ పొత్తు కొనసాగుతుందా? ఫ్రెండ్లీ ఫైట్ ఉంటుందా? ఎవరికి వారు పోటీ చేస్తారా? అనేది తేలాల్సి ఉన్నది. కొత్తగూడెం, పాల్వంచ రెండు మున్సిపాలిటీలను కలిపి కార్పొరేషన్‌గా ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రాన్ని కార్పొరేషన్‌గా మార్చాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. చట్టబద్ధత కూడా వచ్చింది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఈ కార్పొరేషన్ మేయర్ పదవిని తమకు కేటాయించాలని, అత్యధిక డివిజన్లు తమకే కేటాయించాలని సీపీఐ డిమాండ్ చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌కు సహకరిస్తున్నందున.. ఇక్కడైనా తమకు సహకరించాలని విన్నవిస్తున్నది. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఎమ్మెల్యేగా సీపీఐ ఉన్నందున.. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్‌కు అవకాశం కల్పిస్తే ఇక్కడి స్థానిక నాయకులకు గుర్తింపు దక్కుతుందని, రెండు పార్టీలు సఖ్యతతో పని చేయొచ్చని చెబుతున్నారు. కార్పొరేషన్ అంశం రాష్ట్ర స్థాయిలో తేలాల్సి ఉంటుందని, పొత్తా? ఫ్రెండ్లీ కాంటెస్టా? ఎవరికి వారు పోటీ చేయడమా అనేది ఎన్నికల షెడ్యూల్ వస్తే కానీ స్పష్టత వచ్చేలా లేదు. తాము పొత్తుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నా.. సీట్ల విషయంలో సర్దుబాటు కుదరకపోతే పరస్పరం పోటీ చేసేందుకు వెనకాడబోమంటూ ఇరు పార్టీల నేతలు ప్రకటిస్తున్నారు. అయితే ఇరు పార్టీల కేడర్‌లో సఖ్యత లేకుంటే దాని ప్రభావంతో ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు (BRS) ప్రయోజనం కలుగుతుందనే ఆందోళన సైతం ద్వితీయ శ్రేణి నాయకుల్లో వ్యక్తం అవుతున్నది.
ఒంటరిగానే మజ్లిస్!
మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం (AIMIM) ప్రభావం చూపే అవకాశాలున్నాయి. గత ఎన్నికల ఓట్లు, సీట్లను పరిశీలిస్తే ఇదే విషయం తెలుస్తున్నది. ఆ పార్టీ ఇప్పటి వరకు ఏ పార్టీతోనే నేరుగా అధికారికంగా పొత్తు పెట్టుకోలేదు. ఎన్నికల తర్వాత మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల విషయంలో మాత్రం పొత్తు పెట్టుకున్నారు. దీంతో ఈ సారీ ఒంటరిగానే పోటీ చేస్తారనే చర్చ జరుగుతున్నది. అంతేకాకుండా గతంలో కంటే ఎక్కువ సీట్లతో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
‘కూటమి’పై స్పష్టత కరువు
బీజేపీ-జనసేన (Janasena) పార్టీలు గత అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. ఏపీలోని ‘కూటమి’ ప్రభుత్వంలో ఈ రెండు పార్టీలు భాగస్వాములై ఉన్నాయి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు జనసేన ఇప్పటికే ప్రకటించింది. అయితే బీజేపీతో (BJP) పొత్తు ఉంటుందా? లేక ఒంటరిగా పోటీ చేస్తామా? అనేది జనసేన స్పష్టత ఇవ్వలేదు. దీనిపై ఉత్కంఠ కొనసాగుతున్నది. తాము ఒంటరిగానే పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నామని, జనసేన, టీడీపీలతో పొత్తు ఉండదని బీజేపీ అంటున్నది. తాము స్వంతంత్రంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు. దీంతో తెలంగాణలో జనసేన-టీడీపీ (TDP) - బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశాలు లేవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై ఇంకా తన వైఖరి ప్రకటించలేదు. పండుగ తర్వాత స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. బీఆర్ఎస్ సైతం సింగిల్‌గానే ముందుకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఆ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు తెలుస్తున్నది.
Read More..






