- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నల్గొండ యువతి దుర్మరణం
ఉన్నత ఆశయాలతో చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ తెలుగమ్మాయిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఉన్నత ఆశయాలతో చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ తెలుగమ్మాయిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. నల్గొండ జిల్లాకు చెందిన యువతి షికాగోలో జరిగిన ఘోర ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టు గ్రామానికి చెందిన గడసు శ్రీనివాస్‌రెడ్డి కుమార్తె నవ్య (24) ఉన్నత విద్య కోసం రెండున్నరేళ్ల క్రితం అమెరికా వెళ్లింది. ఎంఎస్ (MS) పూర్తి చేసి, ప్రస్తుతం అక్కడ ఓ పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. విధి నిర్వహణ అనంతరం ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది. వీరు ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు నవ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
శోకసంద్రంలో చెరువుగట్టు!
చేతికొచ్చిన కూతురు అకస్మాత్తుగా, ఊహించని రీతిలో మృత్యువాత పడటంతో నవ్య స్వగ్రామం చెరువుగట్టులో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కుమార్తె మృతి విషయం తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
భౌతికకాయాన్ని రప్పించేందుకు మంత్రి కృషి
నవ్య అకాల మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ బాధిత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ‘ఉన్నత ఆశయాలతో ఉన్న నవ్య మరణం ఆ కుటుంబానికి తీరని లోటు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది’ అని ఆయన పేర్కొన్నారు. నవ్య భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ఉన్నతాధికారులతో పాటు, అమెరికాలోని తానా , ఆటా ప్రతినిధులతో మాట్లాడి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు.






