IND VS ENG : రెండో టెస్టులో విజయం దిశగా భారత్.. కావాల్సింది మరో 7 వికెట్లే

by Harish |   (  Updated:2025-07-06 15:03:45  IST  )

ఎడ్జ్‌బస్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు టీమిండియా అడుగుదూరంలో నిలిచింది.

IND VS ENG : రెండో టెస్టులో విజయం దిశగా భారత్.. కావాల్సింది మరో 7 వికెట్లే
X

దిశ, స్పోర్ట్స్ : ఎడ్జ్‌బస్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు టీమిండియా అడుగుదూరంలో నిలిచింది. రెండో టెస్టుపై భారత్ పూర్తి పట్టు సాధించింది. విజయం దిశగా వెళ్తున్న గిల్ సేనకు కావాల్సింది మరో 7 వికెట్లే. రెండో టెస్టులో భారత్ విజయం దాదాపు ఖాయమే. శనివారం ముందుగా రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ 427/6 స్కోరు వద్ద డిక్లేర్డ్ ఇచ్చింది. కెప్టెన్ గిల్(161) మరో భారీ శతకంతో రెచ్చిపోగా.. జడేజా(69), పంత్(65), రాహుల్(55) కూడా రాణించడంతో టీమిండియా తిరుగులేని స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 180 పరుగులు కలుపుకుని ఇంగ్లాండ్ ముందు 608 పరుగుల భారీ టార్గెట్ పెట్టింది. భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ తడబడుతోంది. నాలుగు రోజు ఆట ముగిసే సమయానికి 72/3 స్కోరుతో కష్టాల్లో పడింది. ఆ జట్టు ఇంకా 536 రన్స్ చేయాల్సి ఉండగా.. ఆదివారమే చివరి రోజు. అద్భుతం చేస్తే తప్ప ఇంగ్లాండ్ ఓటమి నుంచి తప్పించుకోలేదు.

గిల్ మళ్లీ జిగేల్

నాలుగో రోజు భారత బ్యాటర్లు అదరగొట్టారు. క్రీజులోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇంగ్లాండ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ముందుగా ఓవర్‌నైట్ 64/1తో రాహుల్, కరుణ్ నాయర్ ఆటను కొనసాగించారు. కరుణ్ త్వరగానే అవుటైనా.. రాహుల్ మాత్రం హాఫ్ సెంచరీతో రాణించాడు. కరుణ్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ గిల్ మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో కదం తొక్కిన అతను రెండో ఇన్నింగ్స్‌లోనూ శతకం బాదాడు. 162 బంతుల్లో 161 రన్స్ చేశాడు. ఆరంభంలో నిదానంగా ఆడిన అతను క్రీజులో పాతుకపోయిన కొద్ది దూకుడు పెంచాడు. అతని ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. గిల్‌కుతోడు మరో ఎండ్‌లో రిషబ్ పంత్, రవీంద్ర జడేజా కూడా సత్తాచాటడంతో భారత్‌కు తిరుగులేకుండా పోయింది. పంత్ తనదైన స్టైల్‌లో అలరించాడు. తొలి ఓవర్‌లోనే వరుసగా 4, 6 దంచిన అతను క్రీజులో ఉన్నంత సేపు ఇంగ్లాండ్ బౌలర్లను చితకబాదాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. పంత్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన జడేజా.. గిల్‌కు చక్కటి సహకారం అందించాడు. స్ట్రైక్ రొటేట్ చేస్తూనే జడేజా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆచితూచి ఆడిన అతను 69 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఎండ్‌లో చెలరేగిన గిల్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత మరింత రెచ్చిపోయాడు. అయితే, షోయబ్ బషీర్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి గిల్ వెనుదిరిగాడు. ఆ తర్వాత కాసేపటికే నితీశ్(1) మరోసారి విఫలమవ్వగా.. ఆ కాసేపటికే భారత్ 427/6 స్కోరు వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ ఇచ్చింది.

కష్టాల్లో ఇంగ్లాండ్

608 పరుగుల భారీ లక్ష్యం ఇంగ్లాండ్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. దీంతో ఆఖరి సెషన్‌లో ఛేదనకు దిగిన ఆ జట్టు తీవ్రంగా తడబడుతోంది. ఈ క్రమంలోనే ప్రత్యర్థి మూడు కీలక వికెట్లను కోల్పోయింది. సిరాజ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే జాక్ క్రాలీ(0)ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత ఆకాశ్ దీప్ దెబ్బ దెబ్బ కొట్టాడు. బెన్ డక్కెట్(25), జో రూట్(6)లను అవుట్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓలీ పోప్(24), హ్యారీ బ్రూక్(15) ఆచితూచి ఆడుతూ నాలుగో రోజును ముగించారు. మరి, చివరి రోజైనా ఇంగ్లాండ్‌ ఏ మేరకు పోరాడుతుందో చూడాలి. ఓటమి నుంచి తప్పించుకోవాలంటే ఆ జట్టు అసాధారణ ప్రదర్శన చేయాల్సిందే.

టీమిండియా రెండో ఇన్నింగ్స్ డిక్లేర్.. ఇంగ్లాండ్ టార్గెట్ ఎంతంటే?

Next Story