క్రికెట్‌లో ఆ నిబంధనల్లో మార్పులు చేయనున్న ఐసీసీ

by Harish |   (  Updated:2026-05-23 12:43:41  IST  )

క్రికెట్‌లో ఆ నిబంధనల్లో మార్పులు చేయనున్న ఐసీసీ
X

దిశ, స్పోర్ట్స్ : ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఆట నిబంధనల్లో పలు మార్పులు చేయాలని ఆలోచిస్తున్నది. ఈ నెల 30న అహ్మదాబాద్‌లో ఐసీసీ బోర్డు మీటింగ్ జరగనుంది. ఆట నిబంధనలకు సంబంధించిన మార్పులు, సవరణలు ప్రస్తుతం చర్చల దశలో ఉండగా ఆ సమావేశంలో ఆమోదం లభించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ మార్పుల్లో సాధారణ టెస్టు మ్యాచ్‌‌లో ఆట జరుగుతున్న సమయంలోనే రెడ్ బాల్‌కు బదులు పింక్ బాల్ ఉపయోగించడం అత్యంత ముఖ్యమైనది. వాతావరణం ప్రతికూలంగా ఉన్న సమయంలో పింక్ బాల్‌‌కు అనుమతి ఇవ్వాలని ఐసీసీ భావిస్తున్నది. దాని ద్వారా ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఆట కొనసాగించొచ్చని ఆలోచన. ఇరు జట్లు అంగీకరిస్తేనే పింక్ బాల్‌ను ఉపయోగించేలా నిబంధనల్లో పేర్కొననుంది. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో రెడ్ బాల్ కంటే పింక్ బాల్ స్పష్టంగా కనిపిస్తుంది.

డ్రింక్స్ బ్రేక్స్‌లో మైదానంలోకి హెడ్ కోచ్

టీ20ల్లో డ్రింక్స్ బ్రేక్స్ సమయంలో వ్యూహాత్మక కారణాల దృష్ట్యా హెడ్ కోచ్‌కు మైదానంలోకి అనుమతి ఉంది. వన్డేల్లో కూడా దీన్ని తీసుకురావాలని ఐసీసీ భావిస్తుంది. ప్రస్తుతం కేవలం సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ల‌కు మాత్రమే డ్రింక్స్ బ్రేక్స్ సమయంలో మైదానంలోకి అనుమతి ఉంది. ప్లేయర్లకు ఏదైనా సమాచారం ఇవ్వాలనుకుంటే హెడ్ కోచ్ వారి ద్వారా తెలియజేస్తాడు. కానీ, ఇప్పుడు ఆ అవసరం లేదు. హెడ్ కోచే స్వయంగా మైదానంలోకి వెళ్లి ప్లేయర్లతో వ్యూహాల గురించి చర్చించొచ్చు. సాధారణంగా సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లు సరైన క్రికెట్ దుస్తులు ధరించాలనే రూల్ ఉంది. మరి అది హెడ్ కోచ్ కూడా వర్తిస్తుందా? అన్నది తెలియాలి. అలాగే, ఓ ఇన్నింగ్స్‌లో రెండు డ్రింక్స్ బ్రేక్స్‌కు అనుమతి ఇవ్వనున్నారు.

ఇన్నింగ్స్ బ్రేక్ సమయం కుదింపు

టీ20ల్లో ఇన్నింగ్స్ బ్రేక్ సమయాన్ని కుదించాలనే అంశం కూడా ఐసీసీ ప్లాన్స్‌లో ఉంది. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభానికి మధ్య 20 నిమిషాల సమయం ఉంది. దీన్ని 15 నిమిషాలకు తగ్గించాలని ఐసీసీ భావిస్తుంది. దీని వల్ల తొలి ఇన్నింగ్స్ తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి, వ్యూహరచన చేయడానికి ఇరు జట్లకు ఐదు నిమిషాల సమయం తగ్గుతుంది. అలాగే, అనుమానస్పద బౌలింగ్ యాక్షన్ ఉన్న బౌలర్లపై చర్యలు తీసుకోవడానికి ఐసీసీ నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది. మ్యాచ్ సమయంలోనే బౌలర్ల చట్టవిరుద్ధమైన బౌలింగ్ యాక్షన్‌లను తనిఖీ చేయడానికి ఫీల్డ్ అంపైర్లకు హాక్‌ఐ డాటాను అందుబాటులోకి తీసుకరావాలని భావిస్తున్నది. గురువారం వర్చువల్‌గా జరిగిన ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్‌‌లో ఈ మార్పులపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి ఐసీసీ క్రికెట్ కమిటీ హెడ్ సౌరవ్ గంగూలీ కూడా హాజరయ్యారు. ఈ నెల 30న జరిగే బోర్డు మీటింగ్‌లో ప్రతిపాదిత మార్పులు, సవరణలను ఆమోదించి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చే ఆలోచనలో ఐసీసీ ఉన్నట్టు తెలుస్తోంది.

వినేశ్‌ ఫొగాట్‌కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట.. వివాదం ఏమిటంటే?

Next Story