- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వినేశ్ ఫొగాట్‌కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట.. వివాదం ఏమిటంటే?
ప్రముఖ భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ నెల 30, 31 తేదీల్లో జరగనున్న 2026 ఏషియన్ గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు కోర్టు ఆమెకు అనుమతినిచ్చింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ నెల 30, 31 తేదీల్లో జరగనున్న 2026 ఏషియన్ గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు కోర్టు ఆమెకు అనుమతినిచ్చింది. ఇదే సమయంలో భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) వ్యవహరించిన తీరుపై న్యాయస్ధానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చీఫ్ జస్టిస్ డి.కె. ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియాలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో కీలక వ్యాఖ్యలు చేసింది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మాతృత్వాన్ని గౌరవిస్తారని కోర్టు పేర్కొంది. గర్భధారణ, ప్రసవానంతర రికవరీ (Post-partum recovery) కారణాల వల్ల మహిళా అథ్లెట్లకు నష్టం చేకూర్చేలా ఎలాంటి నిబంధనలు ఉన్నా.. అవి రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 ప్రకారం సమానత్వ హక్కును ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది.
కక్ష సాధింపు చర్యలే..!
2024 పారిస్ ఒలింపిక్స్‌లో వినేశ్ డిస్‌క్వాలిఫై అవ్వడాన్ని ‘జాతీయ అవమానం’గా అభివర్ణిస్తూ WFI జారీ చేసిన షోకాజ్ నోటీసును కోర్టు తప్పుపట్టింది. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS) వినేశ్ తప్పేమీ లేదని తేల్చినప్పటికీ, WFI ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆమెపై ఉన్న కక్షసాధింపు ధోరణికి అద్దం పడుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వినేశ్ ఫొగాట్ పాల్గొనే ఏషియన్ గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్‌ను పూర్తిగా వీడియో రికార్డింగ్ చేయాలని కోర్టు ఆదేశించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI), ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA)ల నుంచి ఇద్దరు స్వతంత్ర పరిశీలకుల సమక్షంలో ఈ ప్రక్రియను నిర్వహించాలని స్పష్టం చేసింది.
వివాదం ఏమిటంటే..?
2025 లేదా 2026 లో జరిగిన పోటీల్లో పతకాలు సాధించిన వారికే ట్రయల్స్‌కు అర్హత ఉంటుందని WFI ఒక కొత్త నిబంధనను తెచ్చింది. అయితే, జూలై 2025లో వినేశ్ ఫొగాట్ బిడ్డకు జన్మనివ్వడం, ఆ తర్వాత రికవరీ కోసం విరామం తీసుకోవడం వల్ల ఆమె ఏ పోటీల్లోనూ పాల్గొనలేకపోయారు. WFI తెచ్చిన ఈ నిబంధన ఐకానిక్ క్రీడాకారిణి అయిన తనను ఉద్దేశపూర్వకంగా తప్పించేలా ఉందంటూ వినేశ్ హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది.






