- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనడంపై బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం.. ఐసీసీకి లేఖ

దిశ, స్పోర్ట్స్ : భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఐపీఎల్-2026 నుంచి తప్పించడం వివాదంగా మారింది. బీసీసీఐ ఆదేశాల మేరకు కోల్‌కతా నైట్ రైడర్స్ తమ జట్టు నుంచి ముస్తాఫిజుర్‌ను రిలీజ్ చేసింది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో భారత్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్‌కు తమ జట్టును పంపమని స్పష్టం చేసింది. తమ మ్యాచ్‌లను భారత్ నుంచి తరలించాలని ఐసీసీకి ఆదివారం లేఖ రాసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటగాళ్ల భద్రతను దృష్టి ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ‘ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఆందోళనలను అంచనా వేసిన తర్వాత భారత్‌లో బంగ్లాదేశ్ జట్టు భద్రతపై బంగ్లాదేశ్ ప్రభుత్వం సూచన మేరకు బంగ్లాదేశ్ జాతీయ జట్టును భారత్‌కు పంపొద్దని బోర్డు నిర్ణయించింది. బంగ్లాదేశ్ ప్లేయర్లు, జట్టు అధికారుల శ్రేయస్సు కోసం, సురక్షిత ప్రాంతంలో జట్టు టోర్నమెంట్‌లో పాల్గొనడానికి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితిని ఐసీసీ అర్థం చేసుకుని ఈ విషయంలో త్వరగా ప్రతిస్పందిస్తుందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఎదురుచూస్తుంది.’అని బీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. బీసీబీ లేఖపై ఐసీసీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
శ్రీలంకకు తరలింపు!
టీ20 ప్రపంచకప్ షెడ్యూల ప్రకారం.. బంగ్లా జట్టు కోల్‌కతాలో ఫిబ్రవరి 7న తమ తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది. అదే వేదికపై 9న ఇటలీతో, 14న ఇంగ్లాండ్‌తో ఆడనుంది. ముంబైలో 17న నేపాల్‌తో ఆడనుంది. భారత్‌తోపాటు శ్రీలంక కూడా ఈ ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ జట్టు తమ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడుతుంది. బీసీబీ అభ్యర్థనతో బంగ్లా మ్యాచ్‌లను ఐసీసీ శ్రీలంకకు తరలించే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే షెడ్యూల్‌లో భారీ మార్పులు తప్పవు. టోర్నీకి ఎంతో సమయం లేదు. మరో నెల రోజుల్లో ప్రపంచకప్ ప్రారంభంకానుంది. ఈ పరిస్థితుల్లో టోర్నీ షెడ్యూల్‌లో ఐసీసీ మార్పులు చేస్తుందా? అన్నది చూడాలి.
ముస్తాఫిజుర్ ఎన్‌వోసీ రద్దు
ఐపీఎల్ ఆడేందుకు ముస్తాఫిజుర్‌కు ఇచ్చిన ఎన్‌వోసీని బీసీబీ రద్దు చేసింది. బోర్డు మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఒకవేళ కోల్‌కతా నైట్ రైడర్స్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నా బీసీబీ మాత్రం ముస్తాఫిజుర్‌ను తిరిగి ఐపీఎల్ ఆడేందుకు అనుమతించదు.
READ MORE ....






