- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శవాలను తవ్వి తీసే వింత ఆచారం.. ఇండోనేషియాలో 'మనేనే' వేడుక
పొలాల అమావాస్య వెళ్లిన తర్వాత వచ్చే మహాలయ పితృ అమావాస్య గురించి తెలియని తెలుగు వారుండరు.

దిశ, వెబ్ డెస్క్ : పొలాల అమావాస్య వెళ్లిన తర్వాత వచ్చే మహాలయ పితృ అమావాస్య గురించి తెలియని తెలుగు వారుండరు. ప్రపంచంలో ఏ మూలాన ఉన్నా.. ఆ రోజు తమ పూర్వీకులను తల్చుకుంటూ.. వారికి ఇష్టమైనవి వంటలు వండి, ఫోటోల ముందు పెట్టి, తమని చల్లగా చూడమని మొక్కుతారు. అయితే ఇలా కుటుంబంలో చనిపోయిన తాతలు, ముత్తాతలు, అవ్వలను స్మరించుకునే సాంప్రదాయం ఒక్క మన తెలుగులోనో.. లేదా ద్రవిడ నాటనే ఉంటుందా అంటే? కాదు పేర్లు వేరైనా ఇలాంటి ఆచారాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయని తెలుస్తోంది. ఉదాహరణకు ఇండోనేషియాలోని తోరాజా తెగవారు మరణించిన తమ పూర్వీకుల సమాధులను తవ్వి, ఆ అస్థిపంజరాలను జాగ్రత్తగా శుభ్రపరిచి, కొత్త బట్టలు వేసి, సుగంధ ద్రవ్యాలు పూసి, మరణించిన వారి జీవిత విశేషాలను కథలుగా చెప్పుకుంటూ, విందులు వినోదాలతో వేడుకలు చేస్తారు. దీనినే "మనేనే ఆచారం" అంటారు. దీన్నే "శవాలను శుభ్రపరిచే పండగ" అని కూడా అంటారట. ఇండోనేషియాలోని దక్షిణ సులవేసి హైలాండ్స్‌లో నివసించే తోరాజా ప్రజలు మాత్రమే జరుపుకునే విలక్షణమైన ఆచారం.. ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆకర్షించింది.
తోరాజా ప్రజల విశ్వాసాలు కూడా మన సంప్రదాయాలకు కాస్త దగ్గరగా ఉంటాయి. మనదగ్గర చనిపోయినపుడు చేసే అంత్యక్రియల ప్రక్రియ ఎలా ఖరీదుతో కూడుకొని ఉంటుందో.. తోరాజా ప్రజల అంత్యక్రియలకు కూడా భారీగా ఖర్చు చేస్తారట. అనంతరం జరిపే క్రతువులు రోజుల తరబడీ, నెలల తరబడి చేసినట్టే.. వారు కూడా ఏళ్ల తరబడి చేస్తూనే ఉంటారట. ఇక ప్రతి ఏటా మనం జరుపుకునే పితృ అమావాస్య లాంటిదే వారి మనేనే ఆచారం కూడా. ఇక్కడ మనం మరణించిన మన పూర్వీకులు తిరిగి మన కుటుంబంలోనే మళ్ళి జన్మించారని నమ్మినట్టు, వారు కూడా వారి పూర్వీకుల ఆత్మలు మరో జన్మ ఎత్తుతారని నమ్ముతారట. పూర్వీకులను తలుస్తూ వారు కథలను చెప్పుకున్నట్టు, మనదగ్గర వారిని తలుస్తూ అన్నదానం చేయించడం, ఆశ్రిత కులాల వారితో కథలు చెప్పించడంను పోలి ఉంటుంది.
మరణించిన వారి శరీరాలను మనలాగా దహనం చేయడమో, మట్టిలో పూడ్చడమో కాకుండా రాతి కొండలలో చెక్కిన సమాధుల్లో భద్రపరుస్తారు. మనేనే ఆచార క్రతువుల్లో వాటిని జాగ్రత్తగా బయటికి తీసి, వేడుకలు అయ్యాక, ఆ కొండలోని సమాధిని శుభ్రం చేసి, అందులో కూడా సుగంధ పరిమళాలు, పవిత్ర జలాలు ఉంచి తిరిగి యధా స్థానంలో పూడ్చివేస్తారు. అయితే ఈ మనేనే క్రతువు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే.. మరణించిన వారి ఆత్మలు వెంటనే పరలోకాన్ని చేరడానికి అనేక సంవత్సరాలు పడుతుందని, అప్పటి వరకు వారి శవాలను ఇలా జాగ్రత్తగా కాపాడుతూ ఉంటే వారు కుటుంబాన్ని ఆపదల నుంచి రక్షిస్తూ, దీవెనలు ఇస్తారని ప్రగాఢంగా విశ్వసిస్తారట.
తోరాజా తెగ ప్రత్యేక విశ్వాసాలు
తోరాజా తెగ ప్రజలు ముఖ్యంగా రెండు రకాల వేడుకలు జరుపుకుంటారు.
*రంబు తుకా ఆచారాలు : సంతానోత్పత్తి, కుటుంబ శ్రేయస్సు కోసం జరుపుకునే వేడుకలు ఇవి. వివాహాలు, పురుళ్ళు, పంటల కాలాల్లో జరిపే అచారాలన్నీ రంబు తుకా కిందకి వస్తాయి.
*రంబు సోలో ఆచారాలు : మరణం, అంత్యక్రియలకు సంబంధించిన వేడుకలు ఇవి. మరణించిన వారి ఆత్మలను పరలోకానికి పంపడానికి జరుపుతారు.
*దేవతలు : అలుక్ టోడోలో(పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయ ఆధ్యాత్మిక శక్తి), పు’మాటల్లో (సృష్టికర్త దేవుడు) లను తోరాజాలు బలంగా విశ్వసిస్తారు. అలాగే, భూమి, ఆకాశం, పూర్వీకుల ఆత్మలు వంటి ఇతర ఆధ్యాత్మిక శక్తులను కూడా ఆరాధిస్తారు. ఈ దేవతలకు బలులు (ముఖ్యంగా గేదెలు, పందులు) ఇచ్చి ఆశీస్సులు పొందుతారు. గేదెలు ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉంటాయని, అవి మరణించిన వారి ఆత్మలను పరలోకానికి తీసుకెళతాయని నమ్ముతారు. ఈ బలులు కుటుంబ హోదాను కూడా సూచిస్తాయి. ఈ విశ్వాసాలు కుటుంబ బంధాలను బలోపేతం చేయడంలోను, తెగ ఐక్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.
మొత్తానికి మన పూర్వీకులను ఎంత ప్రగాఢంగా విశ్వసిస్తామో, గౌరవిస్తామో.. ప్రపంచంలో అనేక తెగల, జాతుల ప్రజలు కూడా అటూ ఇటుగా ఇలాంటి నమ్మకాలే కలిగి ఉంటారు అనిపిస్తోంది కదూ. అవును మరీ.. ఈ భూమి అంతా ఒకప్పుడు ఒకే ముక్కగా ఉన్న 'పాంజియా' నుంచే కదా ఇప్పటి ఖండాలు ఏర్పడింది కదా. విశ్వమానవాళిలో ఎదో ఒక చోట ఒకే రకమైన పోలిక ఉండటంలో ఆశ్చర్యం ఏమీ లేదేమో.
Read More..






