ఆర్భాట తీర్మానం.. ఆరంభ శూరత్వం.!

by Daayi Srishailam |   (  Updated:2026-01-05 08:06:11  IST  )

డే వన్ నుంచే ఆచరణలో పెడితే వస్తుంది. కానీ అలా ఎంతమంది ఫాలో అవుతున్నారు.?

ఆర్భాట తీర్మానం.. ఆరంభ శూరత్వం.!
X

దిశ, ఫీచర్స్: క్యాలెండర్ మారినట్లు మన జీవితం మారాలనుకుంటారు చాలామంది. కసి ఉంటే మారొచ్చు. కానీ "నారాయణా నారాయణా అనుకుంటూ నడింట్ల కూసుంటే" వస్తుందా మార్పు.? కొత్త సంవత్సరంలో "అది మారతా.. ఇది మారతా.. అట్లయితా.. ఇట్లయితా" అనీ కొత్త డైరీలో తీర్మానాలు రాసుకొని తడిబట్టేసుకొని పండుకుంటే రాదు మార్పు. డే వన్ నుంచే ఆచరణలో పెడితే వస్తుంది. కానీ అలా ఎంతమంది ఫాలో అవుతున్నారు.?

రాత్రయితే మర్చిపోతరా.?

కొత్త సంవత్సరంలో మనొళ్లు మస్తు జోష్‌లో ఉన్నారు. పోయిందేదో పోనీ.. ఈ యేడాదిలోనైనా లైఫ్‌ను గాడిలో పెట్టుకోవాలని పట్టుమీదున్నారు. కొత్త డైరీ తీసుకొని.. ఏ నెలలో ఏం చేయాలి.? ఏ రోజున ఏ పని స్టార్ట్ చేయాలి.? ముహుర్తాలెప్పుడు మంచిగున్నాయి.? ఏమేం పనులు పెండింగ్లో ఉన్నాయి.? అసలు టచ్ చేయకూడని అంశాలేంటి.? సంవత్సరానికి 365 రోజులుంటే.. రోజువారీగా ఏమేం చేయొచ్చు.? అని ఏవేవో తీర్మానాలు రాస్కుంటారు. కొత్త సంవత్సరం మురిపెం కదా.. చాలా కసిగా ఉన్నట్లే కనిపిస్తారు. ఇప్పటిప్పుడు జరిగిపోవాల్సిందే అనేంత కసి కనిపిస్తుంది. ఎన్ని ఆటంకాలొచ్చినా వీటిలో ఎలాంటి మార్పు ఉండొద్దనేంత ఉరుకులాట చానా ఉంటది. కానీ.. ఆరంభశూరత్వం కదా.. రాసినవి రాత్రికాగానే మర్చిపోయే మహానుభావులు మనొళ్లు.

విశ్వసనీయత ఎక్కడిది.?

న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అనేవి ఉత్త ట్రాష్ అంతే. చిత్తశుద్ధిలేకుండా వేసుకునే ఆ ప్లాన్లతో అయ్యేదుండదు పొయ్యేదుండదు. సంవత్సరమంతా సాంతం కొవ్వొ్తి కరిగించినట్లు కరిగించేసి అది చేస్తా ఇది చేస్తా అని కొత్త సంవత్సరం నాడు చేసే తీర్మానాలకు విశ్వసనీయత ఎక్కడిది.? ఇంకా గమ్మతి ముచ్చటేందంటే.. కొత్త సంవత్సరం రోజు ఎలా చేస్తే సంవత్సరమంతా అలానే ఉంటుందనుకుంటారు మెజార్టీ పబ్లిక్. అందుకే ఆ రోజు బూతులు మాట్లాడరు. అబద్దాలు చెప్పరు. కొట్లాటలకు వెళ్లరు. అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తారు. డబ్బులు దుబారా చేయరు. పొద్దున్నే లేస్తారు. జిమ్‌కు వెళ్తారు. మంచి ఫుడ్ తీసుకుంటారు. మంతెన సత్యనారాయణ చిట్కాలు చెప్తారు. బుద్ధిగా ఉంటారు.. బుద్ధుని ప్రవచనాలు పలుకుతారు. వినయంగా కనిపిస్తారు.. వివేకానందుని సూక్తులు వళ్లిస్తారు.

ప్రతీ సంవత్సరం ఇదే తంతు..

ప్లాన్ వేసుకోవడం పాటించడం.. ప్రణాళిక పెట్టుకొని ఆచరించడం మంచిదే. దానిని అంతే సోయితో అమలుపరిస్తే ఏ సమస్యా ఉండదు. కానీ మనొళ్లతో అట్లుండదు. "పొద్దటీల గొర్లు కానరావు.. మాపటీల బర్లు కానరావు" అన్నట్లు రెండు మూడు రోజులకు వేసుకున్న ప్లానే గుర్తురాదు. తీసుకున్న తీర్మానమెప్పుడో గంగలో కలిసిపోతుంది. ఫస్ట్ రెండ్రోజులు ఉర్కులాడినంక ఊపు తగ్గుతుంది. వారం పది రోజులకే తీర్మానాలు తీర్థయాత్రలకు తరలిపోతాయి. మల్లా కొత్త సంవత్సరానికి తేదీ మార్చుకొని వస్తాయి. ప్రతీ సంవత్సరం ఇదే తంతు. కొత్త యేడాదికి రిజల్యూషన్స్ పెట్టుకోవడం.. ఉత్సుకతతో రెండు మూడు రోజులు పాటించడం ఆ తర్వాత పాత ముచ్చట కింద పడిపోవడం ఆధునిక మానవుడు ఆవిర్భవించినప్పటి నుంచి తెలుగు సీరియల్‌లా జరుగుతనే ఉంది.

పాత కథనే ముందుకొస్తే.?

న్యూ ఇయర్ రిజల్యూషన్స్‌లో ఫస్ట్ ఉండేది "పొద్దున ఐదింటికే లేవాలె" అనేది. మెజార్టీ పబ్లిక్ పెట్టుకునే రిజల్యూషన్ ఇదే. ఆరు నూరైనా.. నూరు నూటయాభయైనా కచ్చితంగా తెల్లవారుజామున్నే లేద్దామనుకుంటారు. కొత్త సంవత్సరం మొదటిరోజున్నే షురూ చేస్తారు. వాట్సప్‌లో రాసిపెట్టుకొని ఇంపార్టెంట్ కేటగిరీలో స్టార్ మార్క్ చేసిపెట్టుకుంటారు. మల్లా మల్లా గుర్తుండాలని మెసేజీని పిన్ చేస్తారు. ఫోన్లో అలారం పెట్టుకుంటారు. మర్చిపోయే అలవాటుందిగా అనీ ఐదు ఐదు నిమిషాలకు ఇన్‌స్టా రీల్‌ అలారంను ఇన్‌స్టంట్ పోక్‌గా సెట్ చేసుకుంటారు. ఓ వారం రోజులు బాధ్యతగానో.. బలవంతంగానో ఐదింటికే లేస్తరు. ఆ తర్వాత పాత కథనే ముంగటికొస్తుంది. "సలివెడ్తుందని లేస్తలేవా.. శాతనైతలేదని లేస్తలేవా" అని మొత్తుకున్నా లేచే ముచ్చటే ఉండదు.

నాలుగు రోజుల మురిపెం..

కొత్త ఏడాది తీర్మానాల్లో టాప్-2లో ఉండేది "జిమ్‌కెళ్తా.. ఎక్సర్ సైజ్ చేస్తా.. బరువు తగ్గుతా" అనేదే. ఇట్లా తీర్మానించుకున్నొళ్లు ఎంతమంది దానిని పాటిస్తున్నారు.? శాస్త్రానికి రెండు మూడు వారాలు క్రమం తప్పకుండా జిమ్‌‌‌కి వెళ్తారు. ఇంకా కొందరు వాకింగ్‌కి వెళ్తారు. "కొత్తబర్రె పెండ పొద్దూకులూ తీసినట్లు" పొద్దున పొద్దుమూకి జిమ్ సెంటర్ దగ్గర్నే కనిపిస్తారు. మాటిమాటికీ బరువు చూసుకొని.. ఎంత తగ్గినా.. ఎంత తగ్గినా అని పక్కొళ్లను అడుగుతుంటారు. పొద్దున పొద్దుమూకి రెండుసార్లు వాకింగ్ చేస్తుంటారు. "అరే.. వాకింగ్‌కి వెళ్లినప్పటి నుంచి పానం హుషారుంటుంది. జిమ్ముకువొయ్యినప్పటి నుంచి నా బాడీ షేపే మారిపోయింది" అంటూ సెల్ఫ్ సాటిస్ అవుతారు. కానీ.. ఓ నాలుగు వారాల తర్వాత జిమ్‌గి‌మ్ జాన్తా నై అనే ధోరణి కనిపిస్తుంది.

మధ్యలోనే ఎత్తేస్తరా.?

"ఆరోగ్యమే మహాభాగ్యం" అనేది న్యూ ఇయర్ రిజల్యూషన్లో టాప్ ప్రయారిటీ అంశం. దీన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటారు. హెల్త్ ముఖ్యం.. బతికుంటే బలుసాకు తినైనా బతకొచ్చు అనుకుంటారు. "ఇయ్యాల్టి నుంచి ధ్యాసంత హెల్త్ మీదనే పెట్టుకోవాలె" అని తీర్మానించుకొని తీరిగ్గా ఉంటారు. వారం పది రోజులు అసలు జంక్ ఫుడ్డే తినరు. మంతెన సత్యనారాయణ వంటివాళ్లు చెప్పేవన్నీ మైండులోకి ఎక్కించుకుంటారు. ఏంచక్కా కాయగూరలు.. ఆకుకూరలు తింటూ కనిపిస్తారు. జొన్నరొట్టెతో బ్రేక్ ఫాస్ట్.. రాగిముద్దతో లంచ్.. కొర్ర ఉప్మాతో డిన్నర్ చేస్తారు. హండీలకొద్దీ బిర్యానీలు తిన్న పానం.. పసందుగా ఫాస్ట్ ఫుడ్డు రుచెరిగిన నోరు.. బర్గర్లతో బగ్గ దోస్తానాయె. పానం ఊకుంటదా.. పదిహేను రోజులకే మొఖం మొత్తి రిజల్యూషన్‌ని మధ్యలోనే ఎత్తేస్తారు.

మొత్తానికి మానేయొచ్చు కదా.?

"మందు మానేస్తా" అని కొత్త సంవత్సర మేనిఫెస్టోగా ఎవరైనా ప్రకటిస్తే నవ్వొస్తుంది. ఎందుకంటే అది ఏపాటి కార్యరూపం దాల్చేదో మనకు తెలుసు కాబట్టీ. ఐనా.. వాళ్ల సీరియస్‌నెస్ చూసి కొన్నిసార్లు నమ్మక తప్పదు. ఒకరకంగా ప్రతినబూనినట్లే ఉంటది వాళ్ల యవ్వారం. పీపాలకొద్ది తాగే అలవాటున్నొళ్లు ఏక్ దమ్మున మానేస్తమంటే అవుతుందా.? మొదట్లో ఎంతో చిత్తశుద్ధితో కనిపిస్తారు. "నేను తాగుతలేను" అని ఊరంతా తెలిసేల ప్రచారం చేసుకుంటారు. కానీ.. ఏదో ఒకదానికి బెండైపోయి మూణ్నెళ్లు కూడా కాకముందే బాటిల్ మూత విప్పేస్తారు. అట్లనే స్మోకింగ్ అలవాటు కూడా. ఎకాయెకిన స్మోకింగ్ మొత్తం మానేయడం కాకుండా ఒకొక్కటిగా మానేస్తే సంవత్సరకాలంలో మొత్తానికి మొత్తంగా మానేయొచ్చు. కానీ మనం అలా చెయ్యం.

ఏది అవసరం.. ఏది అనవసరం.?

"ఈ యేడాది నుంచి పైసలు దుబారా చెయ్యను. ప్రతీ పైసాను ఆదా చేస్తాను. అనవసర ఖర్చులు తగ్గించుకుంటాను" అని ఏవేవో రిజల్యూషన్స్ పెట్టుకుంటాం. వాస్తవానికి ఇదిగనుక అమలైతే జీవితం సెట్టయినట్టే. దుబారా ఖర్చులను ఆదా చేస్తే ఏ లక్ష రూపాయల చిట్టీ కట్టొచ్చు. తీర్మానించుకున్న కొత్తలో బండి బాగానే పోతున్నట్లు అనిపిస్తుంది. కానీ తర్వా్త్తర్వాత అసలు దుబారాను ఎలా కంట్రోల్ చేయాలో అర్థంకాక సతమతమవుతూ ఉంటారు. ఒకానొక దశలో ఏది అవసరమో.. ఏది అనవసరమో అనేది క్లారిటీ రాదు. అన్నీ అవసరాలుగానే కనిపిస్తుంటాయి. ఆ దెబ్బకు ఈసారైనా అప్పులు తీర్చేయాలి అనుకున్న తీర్మానమెప్పుడో తుంగలోకి కొట్టుకుపోతుంది. మల్లా అవే పాత ఖర్చులు.. క్రెడిట్ కార్డులు.. ఈఎంఐల బాగోతం నడుస్తుంటుంది.

పాటించకుండా పాతరేస్తే.?

జీవితంలో కొన్ని సాధించాలంటే కొన్ని వదిలేసుకోవాలి. కొన్నిసార్లు స్నేహాన్ని కూడా. అంటే మంచి స్నేహితులను కాదు. మనకు హానీ చేసే.. మనల్ని పక్కదోవ పట్టించే సోపతికి టాటా చెప్పాలె. నేటి యువత ఆల్కహాల్.. గంజాయి.. డ్రగ్స్.. బెట్టింగ్ వంటి వాటికి అలవాటుపడి మంచి భవిష్యత్తును చేజేతులా పాడు చేసుకుంటున్నారు. అలాంటి స్నేహితులకు దూరంగా ఉండాలని ఇంట్లోవాళ్లు మరీ మరీ చెప్పడంతో సోయికొచ్చి చెడు స్నేహాలకు దూరంగా ఉండాలని కొత్త సంవత్సరం సందర్భంగా తీర్మానించుకుంటారు. కానీ.. "కూసే గాడిదలు.. మేసే గాడిదలను చెడగొడుతూనే ఉంటాయి కదా". ఆ కూసే గాడిదల మాటల వాట్సప్ మెసేజీలకు.. స్టేటస్‌లకు తలొగ్గి తాననుకున్న తీర్మానాన్ని నెలరోజులు కూడా పాటించకుండా పాతరపెడుతుంటారు.

రిజల్యూషన్ మీదే రివల్యూషనా.?

చదువుకునే పోరగాళ్లయితే ఇక "ఇప్పటి నుంచి బాగా చదువుకుంటా.. మంచి మంచి మార్కులు తెచ్చుకుంటా.. టైంవేస్ట్ చెయ్యను.. పేరెంట్స్ చెప్పినట్లు వింటా.. అకడమిక్ టాపర్‌‌‌‌‌‌‌‌‌‌గా నిలుస్తా" అని న్యూ ఇయర్ రిజల్యూషన్స్ పాస్ చేస్తారు. కొందరేమో "ఈసారైనా జాబ్ కొడతా.. ఫ్రెండ్సందిరికీ జాబ్స్ వచ్చి వాళ్లు బాగా సంపాదిస్తున్నారు. పోయినేడాది చేసిన తప్పులను సరిదిద్దుకొని ఈ యేడాది కచ్చితంగా సక్సెస్ బాట పట్టాలె" అని అనుకుంటారు. ఇట్లా రియలైజ్ అవ్వడం నిజంగా సంతోషకరం. అదే మాటమీద ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. రిజల్యూషన్ సంతృప్తికరంగా అమలయ్యే ఛాన్సుంది. కానీ.. మనొళ్లు అట్లుండరు కదా.? రిజల్యూషన్ మీద మన దుష్ట ఆలోచనలు రివల్యూషన్ చేసి ప్లానంతా పాడైపోతుంది. ఇంకే చేసేదేముండదు. క్యాలెండర్లో ఇంకో పేజీ మలపడం తప్ప.

ఒట్టుతీసి గట్టుమీద పెట్టి..

కొందరు కెరీర్ పరంగా ఎంత ఎదిగినా ఫ్యామిలీపరంగా జీరోగా కనిపిస్తారు. ఇంటిని.. కుటుంబాన్ని.. పిల్లలను పెద్దగా పట్టించుకోరు. వాళ్లకంత టైమే ఇవ్వరనుకోండి. చుట్టాలు.. వాళ్లూ వీళ్లూ వారిస్తే.. సోయికొచ్చి ఇక మారాలి అనుకుంటారు. పిల్లలమీద ఒట్టేస్తారు. మొదటి రోజో.. మొదటి వారమో ముహూర్తం పెట్టుకుంటారు. అంతకుముందు అద్దుమరాత్రి దాక ఇంటికి రానొళ్లు న్యూ ఇయర్ రిజల్యూషన్ తర్వాత సాయంత్రం ఆరింటికే వస్తారు. పిల్లలు దగ్గరికొస్తే "టాటా బైబై" అంటూ ఆదరబాదరా బయల్దేరి వెళ్లేవాళ్లే ఆ తర్వాత వీకెండ్ వస్తే ఫుల్ టైం పిల్లలకు.. ఫ్యామిలీకే ఇస్తుంటారు. అంతలోనే బుర్రలో ఏ పురుగు తిరుగుతుందోగానీ కథ మల్లా మొదటికొస్తుంది. ఒట్టుతీసి గట్టుమీ పెట్టి ఫ్యామిలీ మ్యాన్ కాదని ప్రూవ్ చేసుకుంటారు.

హాబీలా దినచర్యలో భాగమైతేనే..

ఫిట్నెస్ రిజల్యూషన్స్‌లో 82% మంది ఒకవారం కంటే ఎక్కువ వాటిని పాటించరట. హెల్తిఫైమి ఫిట్నెస్ యాప్ రెండు లక్షల మందిపై చేసిన స్టడీ ఆధారంగా నిపుణులు ఈ సంఖ్యను చెప్పారు. ఇటీవలి రిపోర్టుల ప్రకారం 60% కంటే ఎక్కువ మంది తమ న్యూ ఇయర్ రిజల్యూషన్స్‌‌ని 30 రోజుల లోపే వదిలేస్తారు. కేవలం 9-12% మాత్రమే ఏడాది చివరి వరకు ఈ రిజల్యూషన్స్‌ని కొనసాగిస్తారు. అంటే 88-91% మంది రిజల్యూషన్స్ ఫెయిలౌతాయి. దీనికి కారణం ఇప్పటికిప్పుడు జరిగిపోవాలనే ఆత్రం. ఆ ఆత్రంలో ఒక్కసారే 30-40 తీర్మానాలు పెట్టుకుంటారు. దేనిలో స్పష్టత ఉండక క్రమంగా సీరియెస్‌నెస్ పోతుంది. అలా కాకుండా 2-3 గోల్స్ పెట్టుకొని స్ట్రిక్ట్‌గా బ్రేక్ చేయకుండా ఫాలో అవ్వాలి. అప్పుడు అదొక హాబీలా మారి దినచర్యలో భాగమై సక్సెస్ అవుతుంది.

అసలెందుకు ఇవన్నీ.?: రామ్‌గోపాల్ వర్మ, సినీ దర్శకుడు

కొత్త సంవత్సరమనేది ఏడాది పొడవునా ఉండు. కొత్త అనేది కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత నువ్వు నేను అంతా పాత సంవత్సరపు సమస్యలతోనే ఉంటాం. ఇక న్యూ ఇయర్ రిజల్యూషన్స్ గురించి చూస్తే.. కొత్త సంవత్సరం రోజునే ఈ తీర్మానాలు ఎందుకు చేసుకోవాలట.? సమస్యల గురించి సమయం వచ్చినప్పుడల్లా ఎప్పటికప్పుడు వాటిని అమలు చేయాలి. అంతేగానీ వాటికోసమే డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు వేయి ఉండొద్దు. అసలు నా దృష్టిలో కొత్త సంవత్సరం రోజున కొత్త తీర్మానాలు చేయొద్దనదే నా కొత్త సంవత్సర తీర్మానం.

అమలు సాధ్యం కాదా.?: శరత్‌బాబు బండారు, హైదరాబాద్

అనుకున్నవన్నీ ఒకేరోజు జరిగిపోవాలీ.. ఇప్పటికిప్పుడు ఏదో జరిగిపోవాలనే ఆలోచన ఉన్నొళ్లే ఆత్రమాత్రంగా ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ పెట్టుకుంటారు. సరే అవయినా మోతాదుగా పెట్టుకున్నారా అంటే అదీ ఉండదు. ఇక్కడితోనే కథ మొత్తం అయిపోతున్నట్లు ఒక్కసారే 30-40 తీర్మానాలు పెట్టుకుంటే అవి ఏ విధంగా అమలవుతాయి. ఇంకేవిధంగా సక్సెస్ అవుతాయి. ఫస్ట్ చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని సరైన ప్రణాళికతో వెళ్తే ఏ రిజల్యూషనైనా సక్సెస్ అవుతుంది. అట్లగాకుండా భరించలేనంత భారం పెట్టుకొని స్ట్రిక్ట్‌గా అమలు చేయాలంటే మాత్రం జరగని పని.

ప్రతీసారి అవేనా.?: జంగయ్య లాలగారి, ఆరుట్ల

నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ప్రతీ సంవత్సరం అవే తీర్మానాలు కనిపిస్తుంటాయి. వాటినే తిప్పీ తిప్పీ మల్లా పెడుతుంటారు. నిజంగానే అవి అమలయ్యేవే అయితే.. వాటిని కచ్చితంగా పాటిస్తామనే నమ్మకమే ఉంటే ప్రతీసారి అవే ఎందుకొస్తున్నాయి.? గత సంవత్సరం తీర్మానం ఫలించిందంటే అది ఈ సంవత్సరం తీర్మానంలో ఉండొద్దు కదా.? మరి ఎందుకుంటున్నాయంటే వాటిని మనం ఆఖరి వరకు అంతే ఉత్సాహంతో ఫాలో కావడం లేదు. ఆరంభశూరత్వం ప్రదర్శించి మధ్యలోనే వదిలేస్తు్న్నాం. అందుకే ప్రతీసారి ఆ మొక్కుబడి మొక్కులే మొక్కుతుంటాం.

Read More..

సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు.. ఈసారి సరికొత్తగా ఇది ట్రై చేయండి!

Next Story