సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు.. ఈసారి సరికొత్తగా ఇది ట్రై చేయండి!

by Jakkula.Mamatha |   (  Updated:2026-01-05 04:33:37  IST  )

సంక్రాంతికి ఈ పిండి వంటలు ట్రై చేయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.. ఆరోగ్యానికి ఎంతో మంచిది.

సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు.. ఈసారి సరికొత్తగా ఇది ట్రై చేయండి!
X

దిశ,వెబ్‌డెస్క్: కొత్త సంవత్సరంలో మొదటగా వచ్చే పండుగు సంక్రాంతి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఇక, సంక్రాంతి పండగ అంటే ఇంటి ముందు అందమైన రంగవల్లులు, భోగి మంటలు, భోగి పళ్లు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల సంకీర్తనలు, గాలిపటాల సందడి, నోరూరించే పిండి వంటలు ఇలా మూడు రోజుల పండుగను ఎంతో అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి జరుపుకుంటారు.

అయితే.. సంక్రాంతి పండుగ వారం రోజులు ఉందగానే మహిళలు పండక్కి వచ్చే కొడుకులు, కూతుళ్లు, మనవరాళ్ల కోసం పిండి వంటలు ప్రిపేర్ చేస్తారు. సంక్రాంతి పిండి వంటల్లో సకినాలు ఎంతో ఫేమస్​. మకర సంక్రాంతి పండుగ సమయంలో సకినాలు తయారుచేయడం పూర్వీకుల నుంచి ఆచారంగా వస్తోంది. అలాగే, అరిసెలు, చెక్క గారెలు వంటివి కూడా చేస్తారు. ఇకపోతే, పండక్కి ఎలాగో పిండివంటలు చేస్తున్నారు. పిల్లలు స్వీట్‌ను ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే ఈసారి పిల్లల కోసం సరికొత్తగా ఇది ట్రై చేయండి. ఆరోగ్యానికి కూడా మంచిది.

షుగర్ లెస్ నువ్వుల లడ్డు..

తయారీకి కావలసిన పదార్థాలు: తెల్ల నువ్వులు 1 కప్పు, బెల్లం తురుము ముప్పావు కప్పు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి అర టీ స్పూన్, వేరుశెనగ గుళ్లు 2 టేబుల్ స్పూన్.

తయారీ విధానం..

ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి పాన్ పెట్టుకోండి. అందులో తెల్ల నువ్వులు వేయాలి. మంటను సిమ్ లో ఉంచి నువ్వులను దోరగా వేయించాలి. నువ్వులు చిటపటలాడుతూ, లేత బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత అదే పాన్ లో ఒక స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి. అనంతరం తురిమిన బెల్లం అందులో వేయండి. మంటను సిమ్‌లో ఉంచి బెల్లం పూర్తిగా కరిగే వరకు కలపండి. ఇది తీగ పాకం రానవసరం లేదు, బెల్లం కరిగితే చాలు. బెల్లం కరిగిన వెంటనే స్టవ్ ఆపండి.

ఇప్పుడు ఈ మిశ్రమంలో ముందుగా తయారు చేసుకున్న నువ్వుల పొడి, కచ్చాపచ్చాగా దంచిన వేరుశెనగ పలుకులు, యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేయవాలి. బెల్లం నువ్వుల పొడికి బాగా పట్టేలా చూడాలి. ఆ తర్వాత కొంచెం సేపు చల్లారనివ్వండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే మీ అరచేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని, మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ గుండ్రని లడ్డులా చుట్టండి. అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన సంక్రాంతి స్పెషల్ నువ్వుల లడ్డులు రెడీ. వీటిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే 10-15 రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఈ లడ్డూలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు, డైటింగ్ చేసేవారికి, చిన్న పిల్లలకు అద్భుతమైన స్వీట్. ఇందులో ఉండే ఐరన్, కాల్షియం ఎముకలకు బలాన్నిస్తాయి.

Read More..

2026:సంక్రాంతి స్పెషల్ ముగ్గులు.. సులభంగా వేయగలిగే అందమైన రంగోలి డిజైన్స్ ఇవే!

Next Story