సంక్షేమ పాలనకు దిక్సూచీ టీడీపీ.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని

by Dishafeatures2 |
సంక్షేమ పాలనకు దిక్సూచీ టీడీపీ.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని
X

దిశ, తెలంగాణ బ్యూరో : సంక్షేమ పాలనకు దిక్సూచీ టీడీపీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో టీడీపీ 41వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం సభ తర్వాత మరో సభను రాష్ట్ర రాజధానిలో నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తొలిసారి ప్రతినిధుల సభను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ నెల 29న నిర్వహించే సభకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీ ప్రతినిధులు 15 వేలమంది హాజరవుతున్నారన్నారు.

హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాలలో, అన్ని రోడ్లపై స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రధాన కూడళ్లను పసుపుమయం చేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. సభకు వచ్చే ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సభాప్రాంగణంలో సౌకర్యాలు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. పక్కా ప్రణాళికతో ఎలాంటి అవరోధాలు తలెత్తకుండా పార్టీ ప్రతినిధుల సభను విజయవంతం చేయాలని కమిటీల సభ్యులను ఆదేశించారు. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పార్టీ ఆవిర్భావ సభకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. నేతలంతా బాధ్యత తీసుకుని పనిచేయాలన్నారు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నివాసం నుంచి ఎన్టీఆర్ ఘాట్ను సందర్శించి సభకు హాజరవుతారన్నారు.

పార్టీ పొలిట్‌బ్యూరో స‌భ్యులు రావుల చంద్రశేఖ‌ర్ రెడ్డి, అర‌వింద్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రాంతీయ పార్టీల‌లో టీడీపీకి ప్రత్యేక గుర్తింపు ఉంద‌న్నారు. దేశ రాజ‌కీయాల‌ను మ లుపు తిప్పడంతో పాటు జాతీయ పార్టీల‌కు ఛాలెంజ్ విసిరిన పార్టీగా, దేశంలో సంక్షేమ పాల‌న‌కు దిక్చూచిగా మారిన చ‌రిత్ర టీడీపీకే ద‌క్కుతుంద‌న్నారు. కార్యక్రమంలో ప్రతినిధులు నన్నూరి నర్సిరెడ్డి, జ్యోత్స్న, కాట్రగడ్డ ప్రసూన, అట్లూరి సుబ్బారావు, కాసాని వీరేశ్, రాష్ట్ర మీడియా కో ఆర్డినేటర్ బియ్యని సురేష్, సాయి బాబా, అలీ మస్కతి, అశోక్ కుమార్ గౌడ్, సూర్యదేవర లత, సాయి తులసీ తదితరులు పాల్గొన్నారు.

Next Story