కేసీఆర్‌ను ఇరకాటంలో పడేసిన సర్వాయి పాపన్న గౌడ్.. బీజేపీ వ్యూహంలో చిక్కిన సీఎం!

by Disha Web Desk |
కేసీఆర్‌ను ఇరకాటంలో పడేసిన సర్వాయి పాపన్న గౌడ్.. బీజేపీ వ్యూహంలో చిక్కిన సీఎం!
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పని చేస్తున్న బీజేపీ సరికొత్త డిమాండ్ చేస్తోంది. టీఆర్ఎస్ సర్కార్‌ను ఇరకాటంలో పెట్టడంతో పాటు బహుజన వర్గాలను ఆకట్టుకునే విధంగా ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని ఏర్పరుస్తోంది. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని, ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. గురువారం సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జాతి గర్వపడే విధంగా బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన సర్వాయి పాపన్న నిజాం ఆగడాలపై వీరోచితంగా పోరాటం సాగించారని కొనియాడారు. ప్రస్తుతం తెలంగాణ గడ్డ స్వేచ్ఛ వాయువులు పీలుస్తోందంటే ఎందరో మహనీయుల త్యాగాల ఫలితమే అని అన్నారు.

కేసీఆర్‌పై తిరగబడాలి

పోరాడి సాధించికున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ నిజాం తరహా పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనపై యువత తిరగబడాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనను భూస్థాపితం చేసినప్పుడే సర్వాయి పాపన్నకు ఘనమైన నివాళి అవుతుందని చెప్పారు. కుటుంబ పాలనతో కేసీఆర్ రాష్ట్రాన్ని దిగజార్చుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటంబ పాలనకు యువత చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. అయితే జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరును బీజేపీ డిమాండ్ చేయడం ఆసక్తిగా మారింది. రాష్ట్రం ఏర్పాటు అయ్యాక పరిపాలన సౌలభ్యం పేరుతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 31 జిల్లాలు ఉండగా అందులో సర్వాయి పాపన్న సొంత జిల్లా జనగామకు ఆయన పేరును బీజేపీ ప్రతిపాదిస్తోంది.

సెంటిమెంట్‌ను రగిల్చే ప్రయత్నమా?

అధికార టీఆర్ఎస్ తరచూ సెంటిమెంట్ అస్త్రాన్ని ఉపయోగిస్తోంది. అయితే బీజేపీ సైతం ఇదే నినాదం ఎత్తుకుంటోంది. రాబోయే ఎన్నికల నాటికి రాష్ట్రంలోని ఉధ్యమకారులను తమ పార్టీలోకి పెద్ద సంఖ్యలో చేర్చుకోవాలని యోచిస్తోంది. ఇదే క్రమంలో నిజాం రజాకార్ల విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తోంది. తాజాగా నిజాం సేనలపై పోరాటం చేసిన సర్వాయి పాపన్న పేరును ఓ జిల్లాకు ప్రతిపాదించడం ఇందులో భాగమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రం ఏర్పడ్డాక ట్యాంక్ బండ్ పై ఎలాంటి కొత్త విగ్రహాలను ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారి విగ్రహాలను ఏర్పాటు చేయాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ సర్కార్‌ను ఇరుకున పెట్టేలా బీజేపీ తెలివిగా వ్యవహరించిందనే టాక్ వినిపిస్తోంది. ఒక వేళ జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరును ఖరారు చేస్తే అది బీజేపీ ఖాతాలోకి వెళ్తుంది. అలా కాకుండా మౌనంగా ఉంటే సర్వాయి పాపన్న గౌడ్ సామాజిక వర్గాన్ని టీఆర్ఎస్‌కు దూరం చేసే ప్లాన్‌గా తెలుస్తోంది. బీజేపీ డిమాండ్‌పై సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

నేను ఆత్మహత్యకు సిద్ధం.. Putta Madhu సంచలన సవాల్


Next Story

Most Viewed