ధాన్యం కొనుగోలు ప్రక్రియ వెంటనే పూర్తి కావాలి : కలెక్టర్ భవేశ్ మిశ్రా

by Batti.Sumithra |

జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో మిగిలి ఉన్న వరి ధాన్యం సేకరణ ప్రక్రియను జాప్యం లేకుండా వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియ వెంటనే పూర్తి కావాలి : కలెక్టర్ భవేశ్ మిశ్రా
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో మిగిలి ఉన్న వరి ధాన్యం సేకరణ ప్రక్రియను జాప్యం లేకుండా వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వరి ధాన్యం కొనుగోలు అంశం పై సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన ధాన్యం కొనుగోలు పురోగతి, మిగిలి ఉన్న ధాన్యం నిల్వలు, కొనుగోళ్లు పూర్తయిన కేంద్రాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోలు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు.

తక్కువ పరిమాణంలో ధాన్యం మిగిలి ఉన్నా కొనుగోలు కేంద్రాల్లో సేకరణను వేగవంతం చేసి, కొనుగోలు ప్రక్రియ పూర్తికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే కొనుగోళ్లు పూర్తయిన కేంద్రాల్లో అందుబాటులో ఉన్న లారీలు, హమాలీలను ధాన్యం నిల్వలు అధికంగా ఉన్న ఇతర కేంద్రాలకు తరలించి వినియోగించుకోవాలని సూచించారు. ధాన్యం సేకరణ, లోడింగ్, అన్‌లోడింగ్ ప్రక్రియలో ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, పౌరసరఫరాల శాఖ అధికారులు రాజేందర్, సుధాకర్, డీఆర్‌డీఓ విజయలక్ష్మి, డీఎం మార్క్‌ఫెడ్ మహేష్, జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి రమణతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story