- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొబైల్ పోయిందా..? ఇక నో టెన్షన్..!
ప్రస్తుత సాంకేతిక యుగంలో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో కీలక భాగంగా మారిందని, పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్లపై బాధితులు వెంటనే స్పందించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు.

దిశ,ఆదిలాబాద్ : ప్రస్తుత సాంకేతిక యుగంలో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో కీలక భాగంగా మారిందని, పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్లపై బాధితులు వెంటనే స్పందించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. పోయిన మొబైల్ ఫోన్లను తిరిగి రాబట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని తెలిపారు. గురువారం స్థానిక పోలీస్ హెడ్‌క్వార్టర్స్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాలో పోగొట్టుకున్న, చోరీకి గురైన 330 మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అందజేశారు. వీటి విలువ సుమారు రూ.66 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక రికవరీ బృందం వివిధ రాష్ట్రాలు, జిల్లాల్లో ట్రేస్ చేసి ఈ మొబైల్ ఫోన్లను రాబట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశ ప్రాంతాల నుంచి కూడా పలు మొబైల్ ఫోన్లు తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏడాది కాలంలో మొత్తం 1500 మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అందజేయడం జిల్లా చరిత్రలోనే రికార్డుగా నిలిచిందని తెలిపారు. మధ్యతరగతి,పేద కుటుంబాలకు చెందిన వారు కష్టపడి కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్లను తిరిగి అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతు బజార్, బస్టాండ్, రైల్వే స్టేషన్, రిమ్స్ ప్రాంతాల్లో మొబైల్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని, అపరిచితులకు ఫోన్ ఇవ్వడంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మొబైల్ దొంగలపై ప్రత్యేక కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు తిరిగి అందుకోవడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ జిల్లా పోలీసులకు, ముఖ్యంగా ఎస్పీ అఖిల్ మహాజన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, ప్రత్యేక బృంద సభ్యులు ఆర్ఎస్ఐ పి గోపీకృష్ణ, ఎం.ఏ రియాస్, మజీద్, త్రిశూల్, అన్వేష్, నవనీత్ తదితరులు పాల్గొన్నారు.






