పాక్ విమానాలు కూల్చేశాం.. శకలాలు ఎందుకు కనిపించలేదో చెప్పిన సైన్యం

by Phanindra |   (  Updated:2025-05-11 16:21:02  IST  )

ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా చేసిన దాడుల్లో కొన్ని పాకిస్తాన్ విమానాలను తాము కూల్చేశామని వాయుసేన తెలిపింది. అయితే వాటి వివరాలు ఇప్పుడే చెప్పలేమంది.

పాక్ విమానాలు కూల్చేశాం.. శకలాలు ఎందుకు కనిపించలేదో చెప్పిన సైన్యం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్‌ సిందూర్‌లో భారత వాయుసేన విమానాలు పాక్ ఎయిర్‌స్పేస్‌లోకి, అలాగే పాక్ యుద్ధ విమానాలు భారత్ ఎయిర్‌స్పేస్‌లోకి రావడం జరగలేదని ఎయిర్ మార్షల్ ఏకే భారతి స్పష్టంచేశారు. అయితే, ఈ దాడుల్లో పాకిస్తాన్‌కు చెందిన కొన్ని హైటెక్ విమానాలను కూల్చివేశామని మాత్రం ఆయన ప్రకటించారు. కానీ ఆ విమానాలు భారత భూభాగంలోకి ప్రవేశించకపోవడంతో వాటి శకలాలు కనిపించలేదని, వాయుసేన వద్ద మాత్రం ధృడమైన ఆధారాలున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతున్నందున ఈ విషయం గురించి మరిన్ని వివరాలు ప్రకటించలేమని తెలిపారు. అలాగే భారత విమానాలను కూల్చేసిందని పాక్ ప్రగాల్భాలు చెప్పుకోవడం గురించి ప్రశ్నించగా.. భారతీయ పైలెట్లంతా భారత్‌లోనే సురక్షితంగా ఉన్నారని ఎయిర్ మార్షల్ స్పష్టంచేశారు.

ఐసీ814, పుల్వామా దాడుల మాస్టర్‌మైండ్లు హతం..

ఆపరేషన్ సిందూర్‌తో తాము టార్గెట్ చేసిన ఉగ్రస్థావరాల వివరాలను ఎయిర్ మార్షల్ ఏకే భారతి వెల్లడించారు. ముఖ్యంగా మురిద్కే, బహవల్‌పూర్‌లో తాము చాలా కచ్చితత్వంతో ఉగ్రస్థావరాలపై దాడి చేశామని చెప్పారు. ఈ దాడుల్లో ఐసీ814 హైజాక్ మాస్టర్‌మైండ్ యూసుఫ్ అజహర్, పుల్వామా ఉగ్రదాడి ప్లాన్ చేసిన అబ్దుల్ మాలిక్ రవూఫ్, ముదాసిర్ అహ్మద్ కూడా హతమయ్యారని ఆయన చెప్పారు. ఈ దాడుల తర్వాత భారత వాయుసేన స్థావరాలు, సామాన్య ప్రజానీకంపై పాకిస్తాన్ డ్రోన్లు, మానవ రహిత ఎయిర్‌ వెహికల్స్‌తో దాడులకు తెగబడిందని ఆయన తెలిపారు. సివిలియన్ విమానాలను అడ్డుపెట్టుకొని చేసిన ఈ దాడులను తాము సమర్థవంతంగా తిప్పికొట్టామని భారతి చెప్పారు. ఆ విమానాలను తప్పించుకుంటూ శత్రులక్ష్యాలను ధ్వంసం చేశామన్నారు. ఈ దాడులకు ప్రతిగా తాము కూడా ఎదురు దాడులు చేశామని, పాకిస్తాన్‌లోని రాడార్ సైట్లు, ఎయిర్‌బేస్‌లను టార్గెట్ చేసుకొని దాడి చేశామని పేర్కొన్నారు. తాము టార్గెట్ చేసిన ఎయిర్‌బేస్‌ల ఫొటోలను కూడా విడుదల చేశారు.

Read Also..40 మంది పాక్ సైనికులు హతం.. ఆపరేషన్ సిందూర్‌ లక్ష్యం ఉగ్రవాదులే!

Next Story