- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
40 మంది పాక్ సైనికులు హతం.. ఆపరేషన్ సిందూర్ లక్ష్యం ఉగ్రవాదులే!
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాక్ ఎయిర్‌బేస్‌లపై భారత్ దాడి చేసింది. ఈ దాడిలో 40 మంది పాక్ సైనికులు హతమైనట్లు భారత్ ప్రకటించింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్‌తో తాము 9 ఉగ్రస్థావరాలను టార్గెట్ చేశామని భారత రక్షణ దళాలు మరోసారి స్పష్టంచేశాయి. పలు ఉగ్రస్థావరాలను టెర్రరిస్టులు ఖాళీ చేసి వెళ్లిపోయిన విషయం తెలిసిందని, ఈ క్రమంలో ఈ 9 స్థావరాలను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకొని దాడులు చేశామని భారత దళాలు తెలిపాయి. పెహల్గాంలో జరిగిన హింసాత్మక, క్రూరమైన ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేశామని, ఈ దాడిలో వందమందికిపైగా ఉగ్రవాదులు మరణించారని డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ వెల్లడించారు. ఆపరేషన్ అనంతరం తాము కేవలం ఉగ్రస్థావరాలనే టార్గెట్ చేశామనే విషయాన్ని పాకిస్తాన్ డీజీఎంవోకు వివరించామన్నారు. కానీ పాక్ మాత్రం తమ వివరణను వినిపించుకోలేదని, భారత్‌పై దాడి చేస్తామని ప్రకటించిందని ఆయన చెప్పారు. అలాగే ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతున్నదని, పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే దీటుగా బదులిచ్చేందుకు అందరు కమాండర్లకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చిందని డీజీఎంవో ఘాయ్ వివరించారు.
40 మంది పాక్ సైనికులు హతం..
పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ అనంతరం కూడా ఎల్‌వోసీ వద్ద పాక్ దళాలు కాల్పులకు తెగబడ్డాయని డీజీఎంవో ఘాయ్ తెలిపారు. వీటికి భారత దళాలు కూడా గట్టిగా బదులిచ్చాయని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైనప్పటి నుంచి ఎల్‌వోసీ వద్ద ఇదే పరిస్థితి కొనసాగుతోందని ఆయన చెప్పారు. ఈ ఎదురు కాల్పుల్లో ఐదుగురు భారత జవాన్లు వీరమరణం పొందారని, వారి త్యాగాలను ఈ దేశం ఎన్నటికీ మర్చిపోదని తెలిపారు. అలాగే ఎల్‌వోసీ వద్ద కాల్పుల్లో 40 మంది పాకిస్తాన్ సైనికులు, అధికారులు హతమయ్యారని స్పష్టంచేశారు.
ఐసీ814, పుల్వామా దాడుల మాస్టర్‌మైండ్లు హతం..
ఆపరేషన్ సిందూర్‌తో తాము టార్గెట్ చేసిన ఉగ్రస్థావరాల వివరాలను ఎయిర్ మార్షల్ ఏకే భారతి వెల్లడించారు. ముఖ్యంగా మురిద్కే, బహవల్‌పూర్‌లో తాము చాలా కచ్చితత్వంతో ఉగ్రస్థావరాలపై దాడి చేశామని చెప్పారు. ఈ దాడుల్లో ఐసీ814 హైజాక్ మాస్టర్‌మైండ్ యూసుఫ్ అజహర్, పుల్వామా ఉగ్రదాడి ప్లాన్ చేసిన అబ్దుల్ మాలిక్ రవూఫ్, ముదాసిర్ అహ్మద్ కూడా హతమయ్యారని ఆయన చెప్పారు. ఈ దాడుల తర్వాత భారత వాయుసేన స్థావరాలు, సామాన్య ప్రజానీకంపై పాకిస్తాన్ డ్రోన్లు, మానవ రహిత ఎయిర్ వెహికల్స్‌తో దాడులకు తెగబడిందని ఆయన తెలిపారు. సివిలియన్ విమానాలను అడ్డుపెట్టుకొని చేసిన ఈ దాడులను తాము సమర్థవంతంగా తిప్పికొట్టామని భారతి చెప్పారు. ఆ విమానాలను తప్పించుకుంటూ శత్రులక్ష్యాలను ధ్వంసం చేశామన్నారు. ఈ దాడులకు ప్రతిగా తాము కూడా ఎదురు దాడులు చేశామని, పాకిస్తాన్‌లోని రాడార్ సైట్లు, ఎయిర్‌బేస్‌లను టార్గెట్ చేసుకొని దాడి చేశామని పేర్కొన్నారు. తాము టార్గెట్ చేసిన ఎయిర్‌బేస్‌ల ఫొటోలను కూడా విడుదల చేశారు.
పాక్ నుంచి కాల్పుల విరమణ కాల్..
ఈ దాడుల తర్వాత శనివారం మధ్యాహ్నం 3.55 గంటల ప్రాంతంలో పాక్ డీజీఎంవో తనను కాంటాక్ట్ చేశారని భారత డీజీఎంవో ఘాయ్ చెప్పారు. ‘ఉగ్రస్థావరాలను టార్గెట్ చెయ్యడమే ‘ఆపరేషన్ సిందూర్’ లక్ష్యం. అది పూర్తయిన తర్వాత కేవలం శత్రుదాడులనే మేం తిప్పికొడుతున్నాం. కాబట్టి నేను పాక్ డీజీఎంవోతో మాట్లాడాను. ఆయనే కాల్పుల విరమణను ప్రతిపాదించారు’ అని ఘాయ్ స్పష్టంచేశారు. అలాగే, ఆ ఆపరేషన్‌లో వీరమరణం పొందిన ఆటాజవాన్ల త్యాగాన్ని భారత్ ఎప్పటికీ మర్చిపోదన్నారు.
అరేబియా సముద్రంలో నేవీ..
ఈ ఆపరేషన్ సమయంలో భారత నేవీ కూడా అరేబియా సముద్రంలో చాలా అప్రమత్తంగా ఉందని నేవీ వైస్ అడ్మైరల్ ఏఎన్ ప్రమోద్ తెలిపారు. పాకిస్తాన్‌లో ఎలాంటి లక్ష్యాలనైనా టార్గెట్ చేసేందుకు సిద్ధంగా నేవీ నిలబడిందన్నారు. అవసరమైతే కరాచీపై దాడి చేసేందుకు కూడా సిద్ధంగా నిలబడి, పాక్ నేవీని పూర్తిగా ఆత్మరక్షణలో పడేలా చేసిందని తెలిపారు. పాక్ నేవీ దళాలు వారి పోర్టుల్లోనే ఉండిపోవాల్సి వచ్చిందని, వారు భారత్ వైపు వచ్చే సాహసం కూడా చెయ్యలేకపోయిందని స్పష్టం చేశారు.






