అయోధ్యలో విరాళాల చోరీ.. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ, ఖర్గే బహిరంగ లేఖ!

by Malleboina Mahesh |

అయోధ్య ట్రస్ట్‌లో వేల కోట్ల విరాళాల చోరీ జరిగిందంటూ ప్రధాని మోడీకి రాహుల్, ఖర్గే లేఖ.. పారదర్శకత కోసం స్వతంత్ర దర్యాప్తునకు డిమాండ్!

అయోధ్యలో విరాళాల చోరీ.. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ, ఖర్గే బహిరంగ లేఖ!
X

దిశ, వెబ్ డెస్క్: సోమవారం(20-07-2026) నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలు అయోధ్య విరాళాల చోరీ అంశంపై బహిరంగ లేఖ రాశారు. ఈ మేరకు వారిద్దరూ సంయుక్తంగా రాసిన లేఖలో అయోధ్యలో భక్తులు సమర్పించిన వేల కోట్ల రూపాయల విరాళాల చోరీ జరిగిందని, రామాలయ ట్రస్ట్ నియామకాలన్నీ కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చేపట్టినందున.. ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి ఇప్పటివరకు మౌనంగా ఉండటం ఎంతమాత్రం సరికాదని వారు లేఖలో తీవ్ర విమర్శలు గుప్పించారు.

దేశవ్యాప్తంగా కోట్ల మంది భక్తుల సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న ఈ అంశంలో పారదర్శకత ఎంతో అవసరమని, అందువల్ల ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఇప్పటివరకు సేకరించిన విరాళాలు, ఖర్చులకు సంబంధించిన ట్రస్ట్ పూర్తి ఖాతాల వివరాలను, అంతర్గత దర్యాప్తు నివేదికలను వెంటనే బహిరంగ పర్చాలని కోరారు. ఈ విరాళాల చోరీపై నిష్పక్షపాతంగా ఒక స్వతంత్ర దర్యాప్తు (Independent Investigation) చేపట్టి, ఈ అవినీతికి కారణమైన బాధ్యులందరిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా డిమాండ్ చేశారు. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న క్రమంలో ఈ అంశంపై ప్రతిపక్షలు సభలో చర్చకు పట్టుబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story