- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పత్తి పంటకు రక్షణగా సోలార్ ఫెన్సింగ్
ఏల్ నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యమవడం ఒకవైపు, కోతుల బెడద మరోవైపు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.

దిశ, ఏన్కూర్ : ఏల్ నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యమవడం ఒకవైపు, కోతుల బెడద మరోవైపు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆరుతడి పంటలను సాగు చేస్తున్న రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు అదనపు ఆర్థిక భారం అయినప్పటికీ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఏన్కూర్ మండలంలో పత్తి, పెసర, మినుము, మొక్కజొన్న తదితర ఆరుతడి పంటలను సాగు చేస్తున్న రైతులు కోతుల బెడద నుంచి పంటలను రక్షించుకునేందుకు పొలాల చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. పంటలకు నష్టం జరగకుండా చూసుకునేందుకు ఇది ప్రస్తుతం ఏకైక మార్గంగా మారిందని రైతులు చెబుతున్నారు.
అదనపు భారం.. ఆందోళనలో రైతులు..
ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలు పెరగడంతో రైతులపై పెట్టుబడి భారం అధికమైంది. దీనికి తోడు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు కోసం అదనంగా వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పంట సాగు చేయాలంటేనే రైతులు వెనుకడుగు వేసే పరిస్థితి ఏర్పడుతోందని అంటున్నారు.
సబ్సిడీ అమలు చేయాలని డిమాండ్..
పంట పొలాలకు సబ్సిడీపై సోలార్ ఫెన్సింగ్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, పెట్టుబడి ఖర్చులు పెరగడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు సోలార్ ఫెన్సింగ్‌పై ప్రభుత్వం సబ్సిడీ అందించాలని కోరుతున్నారు.
కోతుల బెడద నివారణకు చర్యలు చేపట్టాలి..
కోతుల కారణంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కోతులను అటవీ ప్రాంతాలకు తరలించేలా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవడంతో పాటు రైతుల పంటలను రక్షించే సమగ్ర కార్యాచరణ చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.






