ఆ కొర్రీలతో మేం వర్రీ అవుతున్నాం..!

by  |
ఆ కొర్రీలతో మేం వర్రీ అవుతున్నాం..!
X

దిశ, నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్‌, స్కాలర్‌షిప్‌లు చెల్లించడంలేదు. విద్యాసంవత్సరం గడిచి ఏడాది దాటిపోతున్నా ఇప్పటికీ నిధులు ఇంకా విడుదల చేయలేదు. దీనికి సంబంధించి 2018-19 విద్యాసంవత్సరంలో 13.65 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇప్పటిదాకా పూర్తిస్థాయిలో అప్లికేషన్లు వెరిఫికేషన్‌ కాకపోవడం గమనార్హం. గతేడాది రూ. 1164.4 కోట్లు పెండింగ్‌లో ఉండగా, పాత బకాయిలు సైతం రూ. 287.26 కోట్లు రావాల్సి ఉంది. దీంతో విద్యా సంవత్సరం ముగిసినా ఫీజుల కొర్రీతో మేనేజ్‌మెంట్లు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో స్టూడెంట్లు ఇబ్బందులు పడుతున్నారు.

ఇంకా పరిశీలనలోనే..

విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్‌, స్కాలర్‌షిప్‌ల దరఖాస్తుల పరిశీలన నత్తనడకన సాగుతోన్నది. విద్యా సంవత్సరం పూర్తై ఆరు నెలలు గడిచినా ఇప్పటికీ 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించిన దరఖాస్తుల పరిశీలనే పూర్తికాలేదు. వాస్తవానికి విద్యా సంవత్సరం ముగిసే నాటికి దరఖాస్తులను పరిశీలించి ఫీజులు, స్కాలర్‌షిప్‌లు మంజూరు చేయాల్సి ఉంది. దరఖాస్తుల స్వీకరణలో జాప్యం తదితర కారణాలతో వీటి పరిశీలన కొనసాగుతోన్నది. 2018-19 విద్యా సంవత్సరంలో స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్ మెంట్ కు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 2018 ఆగస్టు నుంచే మొదలైనా పలుసార్లు దరఖాస్తు గడువును పొడిగించారు. చివరగా ఫిబ్రవరి రెండో వారం వరకు అవకాశం కల్పించాయి. దాదాపు 8 నెలల పాటు కొనసాగిన దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత సంక్షేమ శాఖలు పరిశీలన చేపట్టాయి. ఇప్పటివరకు 72.7 శాతం మాత్రమే వెరిఫికేషన్‌ చేశారు. 9.92 లక్షల దరఖాస్తులను పరిశీలించగా, మరో 3.7 లక్షల దరఖాస్తులు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయాల్లో సిబ్బంది కొరతతో పరిశీలన ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోందని సంక్షేమ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

గతేడాదివి రూ. 1164.4 కోట్లు పెండింగ్‌..

గత విద్యా సంవత్సరం స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్ మెంట్ డిమాండ్‌ రూ. 2101.45 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు రూ.941.05 కోట్లు చెల్లించగా, ఇంకా రూ. 1164.4 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇక ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.2400 కోట్లు అవసరం కానున్నాయి. మరోవైపు ఫీజులు చెల్లించకపోవడంతో మేనేజ్‌మెంట్లకు కూడా తిప్పలు తప్పడంలేదు. డబ్బుల్లేక కాలేజీలు నడపలేకపోతున్నామని కాలేజీ మేనేజ్‌మెంట్లు చెబుతున్నాయి.

ఆ ఐదేళ్లలో రూ.287.26 కోట్ల బకాయిలు..

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కింద ఇవ్వాల్సిన నిధులను ఏటా ప్రభుత్వం విడుదల చేస్తున్నప్పటికీ సాంకేతిక కారణాలు, బిల్లుల క్లియరెన్స్‌లో జాప్యంతో ఏటా నూరు శాతం చెల్లింపులు జరగడం లేదు. ఏటా ఒకట్రెండు శాతం నిధులు విడుదల కాకపోవడం, తర్వాత ఏడాదిలో వీటికి మోక్షం లభించకపోవడంతో అవి పెండింగ్‌ పడుతూ వస్తున్నాయి. 2013-14 విద్యా సంవత్సరం నుంచి 2017-18 విద్యా సంవత్సరం వరకు రూ.287.26 కోట్లు బకాయిలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.

సర్టిఫికెట్లు ఇస్తలేరు..!

విద్యాసంవత్సరం ముగిసినా ఇంకా సర్టిఫికెట్లు మాత్రం ఆయా కళాశాలల్లోనే ఉన్నాయి. ఫీజు రీయింబర్స్ మెంట్ పెండింగ్‌లో ఉండటంతో కాలేజీ మేనేజ్‌మెంట్లు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు. బకాయిలు ఇస్తేనే ఇస్తామని మొండికేస్తున్నాయి. దీంతో కొంత మంది విద్యార్థులు డబ్బులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. మరికొంత మంది విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బులు చెల్లిస్తున్నారు. అయినప్పటికీ కొన్ని కాలేజీలు విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేయడంతోపాటు, ఆ తర్వాత సర్కారు నుంచి వచ్చే ఫీజు రీయింబర్స్ మెంట్ ను కూడా క్లెయిమ్‌ చేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరికొంత మంది ఫీజులు, రీయింబర్స్ మెంట్ చెల్లించక మధ్యలోనే చదువు మానేస్తున్నారు.

శ్రీకాంత్‌ అనే విద్యార్థి ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ఫీజు చెల్లించాలని కళాశాల మేనేజ్‌మెంట్‌ కొర్రీ పెడుతోన్నది. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రాలేదని పేర్కొంటోన్నది. కానీ, శ్రీకాంత్‌ దగ్గర ఫీజు చెల్లించడానికి డబ్బుల్లేవు. సర్కార్‌ ఫీజు చెల్లించేదాకా సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్థితి. ఇలా శ్రీకాంత్‌లాగా ఎంతో మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం విద్యాసంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల పరిశీలనలో అర్హులని తేలితే వెంటనే 25 శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ అందించాలి. విద్యాసంవత్సరం మధ్యలో 50 శాతం, మిగిలినవి చివరిలో చెల్లించాలి’ ఇవీ ఫీజులు చెల్లించేందుకు నిబంధనలు. కానీ, ఇది సక్రమంగా అమలు కావడంలేదు.

నిధులు విడుదల చేయాలె : ప్రవీణ్‌ రెడ్డి, ఏబీవీపీ సెంట్రల్‌ కమిటీ మెంబర్‌

రాష్ట్ర ప్రభుత్వం విద్యపై నిర్లక్ష్యం వహిస్తోన్నది. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోన్నది. ఫీజులు చెల్లించకపోవడంతో మేనేజ్‌మెంట్లు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు. కొంతమంది డబ్బులు లేకపోవడంతో మధ్యలోనే చదువులు మానేస్తున్నారు. వెంటనే సర్కార్‌ ఫీజులు చెల్లించాలి.

సంవత్సరం బకాయిలు (కోట్లలో..)

2014-15 == 5.45
2015-16 == 9.5
2016-17 == 130.05
2017-18 == 135.5
2018-19 ==1164.4

దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు – 13.65 లక్షలు
పరిశీలించిన అప్లికేషన్లు – 9.92 లక్షలు
అప్లికేషన్ల పెండింగ్‌ – 3.7 లక్షలు

Tags: Nalgonda, students, fee reimbursement, dues



Next Story

Most Viewed