ట్రంప్ సుంకాలు రద్దు చేస్తూ ‘సుప్రీం’ తీర్పు.. మళ్లీ వారికే లాభం జరుగనుందా?

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-21 11:31:57  IST  )

మెరికా సుప్రీంకోర్టు వెలువరించిన చరిత్రాత్మక తీర్పు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక అజెండాను ఒక్కసారిగా తలకిందులు చేసింది.

ట్రంప్ సుంకాలు రద్దు చేస్తూ ‘సుప్రీం’ తీర్పు.. మళ్లీ వారికే లాభం జరుగనుందా?
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా సుప్రీంకోర్టు వెలువరించిన చరిత్రాత్మక తీర్పు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక అజెండాను ఒక్కసారిగా తలకిందులు చేసింది. అత్యవసర అధికారాలను (ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్) అడ్డం పెట్టుకుని విదేశీ వస్తువులపై విధించిన భారీ సుంకాలు రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తేల్చిచెప్పింది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు అమెరికా ప్రభుత్వం వసూలు చేసిన సుమారు 130 బిలియన్ డాలర్ల నుంచి 175 బిలియన్ల డాలర్ల వరకు (రూ.11.84 లక్షల కోట్ల నుంచి రూ.15.94 లక్షల కోట్లు) పన్ను వసూళ్లను ఈ తీర్పుతో వెనక్కి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఈ భారీ రీఫండ్ ప్రక్రియలో అసలు బాధితుడైన ‘వినియోగదారుడు’ పూర్తిగా విస్మరించబడటం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నది. గత ఏడాది కాలంగా ఆకాశాన్ని తాకిన నిత్యావసర ధరలతో అల్లాడిపోయిన సామాన్య అమెరికన్లకు ఈ తీర్పు న్యాయం చేస్తుందా అంటే, ప్రస్తుతానికి సమాధానం ‘ప్రశ్నార్థకమే’ అనిపిస్తున్నది.

ఆ డబ్బంతా కంపెనీలకే..

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వం ఈ సుంకాలను ‘ఇంపోర్టర్స్ ఆఫ్ రికార్డ్’ (దిగుమతి చేసుకున్న కంపెనీల)కు తిరిగి చెల్లించాలి. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. గత ఏడాది కాలంలో వస్తువుల ధరలు పెరిగినప్పుడు, ఆ భారాన్ని కంపెనీలు తమ లాభాల నుండి భరించలేదు.. బదులుగా ‘టారిఫ్ పాస్-త్రూ’ పద్ధతిలో నేరుగా వినియోగదారుడి నెత్తిన వేశాయి. ఉదాహరణకు, 10 డాలర్లు ఉండే బియ్యం సంచి ధర 18 డాలర్లకు చేరినప్పుడు, ఆ అదనపు 8 డాలర్లు సామాన్యుడి జేబు నుండే వెళ్లాయి. ఇప్పుడు ప్రభుత్వం ఆ సుంకాలను కంపెనీలకు రీఫండ్ ఇస్తే, అది ఆయా సంస్థలకు అదనపు లాభంగా మారుతుందే తప్ప, ఆ డబ్బు తిరిగి వినియోగదారుడికి అందే మార్గం లేదు. ఇప్పటికే ప్రజల నుండి అధిక ధరల రూపంలో లాభాలు గడించిన కార్పొరేట్ సంస్థలకు, ఇప్పుడు ప్రభుత్వం నుండి కూడా వేల కోట్లు అందడం ‘అయాచితంగా వస్తున్న సొమ్ము’ అని ఆర్థిక నిపుణులు విమర్శిస్తున్నారు.

ధరల తగ్గుదల ఒక్కటే ఏకైక ఊరట

ఈ తీర్పు వల్ల వినియోగదారులకు కలిగే ఏకైక ప్రయోజనం భవిష్యత్తులో ధరలు తగ్గే అవకాశం ఉండటం. సుంకాలు రద్దయిన నేపథ్యంలో, రాబోయే రోజుల్లో నిత్యావసరాల ధరలు 15% నుండి 20% వరకు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సగటున ఒక అమెరికన్ కుటుంబానికి ఏటా 1,300 డాలర్ల నుండి 1,700 డాలర్ల వరకు అదనపు భారం పడుతుండగా, ఇకపై ఆ ఖర్చు సగానికి తగ్గే వీలుంది. అయితే, గతంలో తాము చెల్లించిన అదనపు మొత్తానికి పరిహారం కావాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం రీఫండ్ ఇచ్చే సమయంలో ఆ మొత్తాన్ని కంపెనీలకే పరిమితం చేయకుండా, ప్రజలకు ‘కన్స్యూమర్ రిబేట్స్’ లేదా ‘ట్యాక్స్ క్రెడిట్స్’ రూపంలో పంపిణీ చేసేలా కొత్త చట్టం తీసుకురావాలని పౌర సమాజం కోరుతున్నది. అప్పుడే సుప్రీంకోర్టు తీర్పుకు పూర్తిస్థాయి సార్థకత చేకూరుతుంది.

BIG BREAKING: భారత్ - యూఎస్ ట్రేడ్ డీల్‌లో కీలక మార్పు.. టారిఫ్ భారీగా తగ్గింపు

Next Story