- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
1.25 లక్షల లీటర్ల ఇంధనం భగ్గుమంది.. ఎవర్నీ కాపాడలేకపోయాం: అమిత్ షా
ఎయిరిండియా విమాన ప్రమాద స్థలాన్ని అమిత్ షా సందర్శించారు. 1.25 లక్షల లీటర్ల ఇంధనం భగ్గునడంతో ఎవర్నీ కాపాడలేకపోయామన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదంలో ఘటనా స్థలిని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సందర్శించారు. విమానంలో ఉన్న 1.25 లక్షల లీటర్ల ఇంధనం భగ్గుమనడంతో ప్రయాణికులను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని ఆయన చెప్పారు. ఆయనతోపాటు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, గుజరాత్ సీఎం భూపేంద్ర పాటేల్ కూడా ప్రమాదం జరిగిన స్థలాన్ని సందర్శించారు. ‘విమానంలో 1.25 లక్షల లీటర్ల ఫ్యూయెల్ ఉంది. ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరాయి. ఈ కారణంతోనే ఎవర్నీ కాపాడలేకపోయాం’ అని షా చెప్పారు. ఈ ప్రమాదంలో 200 మందికిపైగా మరణించినట్లు అధికారులు భావిస్తున్నారు. 41 మంది తీవ్రగాయాలతో ఆస్పత్రిలో ఉన్నారు.
‘నేను స్వయంగా ప్రమాద స్థలాన్ని పరిశీలించాను. మృతదేహాలన్నింటినీ అధికారులు రికవర్ చేశారు. బాధితుల కుటుంబాల నుంచి డీఎన్ఏ సేకరించే పనిలో ఉన్నాం. కొన్ని గంటల్లోన ఈ ప్రక్రియ పూర్తవుతుంది. విదేశాలకు చెందిన ప్రయాణికుల కుటుంబాలకు కూడా సమాచారం అందించాం. వారి డీఎన్ఏ శాంపిల్స్‌ను కూడా సాధ్యమైనంత త్వరగా సేకరిస్తాం’ అని షా వెల్లడించారు. డీఎన్ఏ టెస్టులు ముగిసిన తర్వాతే మృతుల సంఖ్య తెలుస్తుందని ఆయన చెప్పారు. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన రమేష్ విశ్వాస్ కుమార్‌ను కూడా షా కలిశారు. కేంద్ర ప్రభుత్వం తరఫున బాధితులకు సానుభూతి తెలియజేసిన ఆయన.. ‘మృతుల కుటుంబాలతోపాటు దేశం అంతా తీవ్రమైన శోకంలో ఉంది’ అని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లోనే విషయం కేంద్రానికి తెలిసిందని, వెంటనే గుజరాత్ సీఎం, హోంశాఖలోని కంట్రోల్ రూమ్స్, పౌర విమానయాన శాఖకు కూడా సమాచారం అందించామని చెప్పారు. విషయం తెలియగానే ప్రధాని మోడీ నేరుగా తనకు కాల్ చేశారన్నారు.
Plane Crash : విమాన ప్రమాదం.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అమిత్ షా






