ప్రజావాణి ఎకనాలెజ్మెంట్ లో 'ఐడీ నంబర్' ఏదీ?

by Kodari Anjali |

పూర్తిస్థాయిలో మాడ్యూల్స్ అభివృద్ధి కాకపోవటంతోనే ప్రజావాణి సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు.

ప్రజావాణి ఎకనాలెజ్మెంట్ లో ఐడీ నంబర్ ఏదీ?
X

దిశ, మేడ్చల్ బ్యూరో: ప్రభుత్వ కార్యాలయంలో ఎవరైనా అర్జీ ఇచ్చుకుంటే దానికి సంబంధించిన వ్యాలీడ్ అక్నాలజీమెంట్ ఇవ్వటం గాని, లేదా కనీసం కార్యాలయం స్టాంప్ వేసి గాని రిసిప్ట్ ఇస్తారు. కానీ కలెక్టర్ స్థాయి కార్యాలయంలో నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’లో ఆ విధమైన ఏర్పాటు లేకపోవడంతో ఫిర్యాదుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే 'ప్రజావాణి' కార్యక్రమంలో అధికారులు ఇదేవిధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆశతో వ్యయ ప్రయాసల కోర్చి వస్తున్న ఫిర్యాదుదారులను అధికారులు తెలివిగా మభ్యపెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అర్జీలు స్వీకరించి, కనీసం ఎలక్ట్రానిక్ జనరేటెడ్ ఐడీ నంబర్ లేదా అధికారిక స్టాంపు లేకుండానే , అక్నాలెడ్జ్ మెంట్ (ఈ తరహా రసీదులను ఎవరైనా తయారు చేసుకోవచ్చు) ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో బాధితులు తమ ఫిర్యాదులను అధికారులకు ఇచ్చినట్లుగా రుజువు ఏముంటుందని..? ఏ విధంగా తమ ఫిర్యాదు దశ తెలుసుకోగలమని ప్రశ్నిస్తున్నారు.

రసీదుల్లో వివరాలు.. ఐడీలు గల్లంతు

గతంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేయగానే ఆన్లైన్లో నమోదు చేసి ఎలక్ట్రానిక్ ఐడీ నంబర్ తో కూడిన అక్నాలెడ్జ్ మెంట్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇటీవల సోమవారం జరిగిన ప్రజావాణిలో భారీగా ఫిర్యాదుదారులు రాగా, వారి లో కొందరికి ఎటువంటి ఆధారం లేని రసీదులు ఇచ్చారు. కేవలం తేదీ, పేరు, మొబైల్ నంబర్, మండలం, గ్రామం, ఏ శాఖకు ఫార్వర్డ్ చేశారో రాస్తున్నారు తప్ప, ఎలక్ట్రానిక్ ఐడీ నంబర్‌ను మాత్రం పేర్కొనడం లేదు. కనీసం రసీదుపై స్టాంపు కూడా వేయకపోవడంతో అది చెల్లుబాటు అవుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అడిగితే నిర్లక్ష్యం.. సిబ్బంది దురుసు ప్రవర్తన

ఐడీ నంబర్, స్టాంపు లేకుండా ఈ రసీదు దేనికి పనికొస్తుందని అధికారులను నిలదీస్తే.. 'ఇన్ వార్డు విభాగానికి వెళ్లి స్టాంపు వేయించుకోండి' అని ఉచిత సలహా ఇస్తున్నారు. తీరా అక్కడికి వెళితే.. 'ప్రజావాణి రసీదులపై మేము స్టాంపు వేయము, నేరుగా మా వద్ద ఇచ్చిన అర్జీకి మాత్రమే స్టాంపు వేస్తాము' అంటూ అక్కడి సిబ్బంది తిప్పి పంపుతున్నారు. ఇదేం పద్ధతి, అటు ఇటు తిప్పుతున్నారని ప్రశ్నిస్తే.. 'ఆ విషయాలు మాకు తెలియదు, మీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి.. కావాలంటే కలెక్టర్ కు చెప్పుకోండి' అంటూ ఇష్టానుసారంగా దురుసుగా మాట్లాడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెండింగ్ ఫైళ్లు దాచేందుకేనా?

వాస్తవానికి ఎలక్ట్రానిక్ ఐడీ నంబర్ ఉంటే పౌరులు తమ ఫిర్యాదు స్టేటస్‌ను భవిష్యత్తులో ఆన్లైన్ ద్వారా ట్రాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ స్పందన రాకపోతే అదే ఐడీతో ఉన్నతాధికారులను కలిసి విన్నవించుకోవచ్చు. కానీ ఐడీ, స్టాంపు లేకపోతే ఫిర్యాదును ట్రాక్ చేయడం అసాధ్యం. కుప్పలుతెప్పలుగా వస్తున్న ప్రజావాణి ఫిర్యాదులను రికార్డుల్లో నమోదు చేయకుండా ఉండేందుకే అధికారులు ఈ విధంగా మభ్యపెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజావాణిలో ఫిర్యాదులు తక్కువగా వస్తున్నాయని ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపించడానికే అధికారులు ఈ మాయాజాలానికి తెరతీశారని పలువురు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రజావాణి ఫిర్యాదుల స్వీకరణలో పారదర్శకత తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

పూర్తిస్థాయిలో మాడ్యూల్స్ అభివృద్ధి కాలేదు

ఈ విషయమై ప్రజావాణి కు సంబంధించిన ఓ అధికారి మాట్లాడుతూ.. కొన్నింటికి ఐడి నెంబర్లు ఇచ్చి మరి కొన్నింటికి ఐడి నెంబర్లు ఇవ్వకపోవడంలో ఎటువంటి దాపరికం లేదని, కేవలం కొన్ని మాడ్యూల్స్ పూర్తిస్థాయిలో అభివృద్ధి కాకపోవడంతోనే ఈ సమస్య తలెత్తుతుందని, ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని చెప్పుకొచ్చారు. మరి అలాంటి సందర్భంలో ప్రజావాణి కార్యక్రమంలోని ఐడి నెంబర్ రానివారికి స్టాంపు వేసి ఇవ్వచ్చు కదా అన్న ప్రశ్నకు ఇకనుంచి అదేవిధంగా చేసేలా చూస్తామని తెలిపారు. అయితే ఈ తరహా ఐడి నెంబర్లు లేకుండా ఎకనాలెడ్జ్జీమెంట్ రసీదులు ఇచ్చిన సందర్భాలు చాలా నెలలుగా ఉన్నాయని ఫిర్యాదుదారులు చెబుతున్నారు.

84 అర్జీలు..

ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును వేగంగా పరిష్కరించాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అర్జీలు, ఫిర్యాదులు మొత్తం 84 వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. వచ్చిన ప్రతి దరఖాస్తును పరిష్కరించి, ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మాలతి,జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Next Story