'ఖాళీగా ఉన్నా.., ఉక్రెయిన్ వెళ్లి యుద్ధంలో చేర‌తా'న‌న్న బ్రిటీషర్‌! భార్య ఏంచేసిందంటే..?

by Disha Web Desk 20 |
ఖాళీగా ఉన్నా.., ఉక్రెయిన్ వెళ్లి యుద్ధంలో చేర‌తాన‌న్న బ్రిటీషర్‌! భార్య ఏంచేసిందంటే..?
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ఉక్రెయిన్, ర‌ష్యా మ‌ధ్య‌ యుద్ధం ప‌తాక‌స్థాయికి చేరుకుంది. ఓ వైపు సంధి సందేశాలు వెలువ‌డుతున్నా, మ‌రోవైపు ర‌ష్యా ద‌ళాలు ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్ న‌గ‌రాన్ని ఆక్ర‌మించుకునే క్ర‌మంలో యుద్ధాన్ని తీవ్రత‌రం చేశాయి. 14 రోజులు దాటిన ఈ యుద్ధంలో వంద‌ల మంది ప్రాణాలు కోల్పోగా, ల‌క్ష‌ల మంది శ‌ర‌ణార్థులుగా మిగిలారు. ఈ త‌రుణంలో యునైటెడ్ కింగ్‌డ‌మ్‌కు చెందిన ఓ వ్యక్తి రష్యన్ దళాలతో పోరాడటానికి ఉక్రెయిన్‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. దానికి కార‌ణం, ఆయ‌న‌ జీవితంలో పెద్దగా పనేమీ చేయట్లేదంట‌!

హార్వే హంట్ (50), దాదాపు 34 సంవత్సరాల క్రితం యూకే ఆర్మీ నుండి రిటైర్ అయ్యారు. మూడేళ్లు ఆర్మీలో ప‌నిచేసిన హార్వే ఎప్పుడూ యుద్ధంలో పాల్గొన లేదు, క‌నీసం యుద్ధాన్నిప్రత్యక్షంగానైనా చూడలేదు. ఖాళీగా ఇంట్లో కూర్చొని, యుద్ధం గురించి టీవీలో వార్త‌లు చూడ‌టంతో అసంతృప్తిగా ఉన్న ఆయ‌న ప్ర‌స్తుతం పోలాండ్‌కు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు 'వేల్స్ ఆన్‌లైన్‌'కు వెల్ల‌డించారు. అక్క‌డ ఉక్రెయిన్ ద‌ళాల‌తో క‌లిసి ర‌ష్యాపై యుద్ధంలో పాల్గొంటానంటున్నారు. ఇప్ప‌టికే యూకే ప్ర‌ధాని ఉక్రెయిన్ వెళ్లే విమానాల‌ను నిషేధించ‌గా, హార్వే మాత్రం పాన్-యూరోపియన్ E40 మోటర్‌వే ద్వారా ఉక్రేనియన్ సరిహద్దుకు వెళతానని అంటున్నారు.

అయితే, ఆయ‌న‌ భార్య జార్జియా హంట్, తన భర్త సరైన ఉద్దేశంతోనే యుద్ధానికి వెళ్తున్నాడ‌ని, ఆయ‌న‌కు పూర్తి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు చెప్పారు. "ఉక్రెయిన్ ప‌రిస్థితి భయానకంగా ఉంది. యుద్ధంలో చనిపోతున్న పిల్లలు, మహిళలు, సామాన్య‌ ప్రజల్ని చూస్తుంటే చాలా బాధ‌గా ఉంది. నా భ‌ర్త‌ ఏదో ఒక విధంగా సహాయం చేయగలిగితే అది సంతోష‌మే" అన్నారామె.

ఇక తాజాగా ఉక్రెయిన్ డిప్యూటీ ఇంటీరియర్ మినిస్టర్ ఓ ప్ర‌క‌ట‌న చేశారు. ఉక్రెయిన్‌కు చెందిన‌ "విదేశీ దళంలో" చేరిన ఎవ‌రికైనా యుద్ధం ముగిసిన తర్వాత త‌మ దేశంలో పౌరసత్వం ఇస్తామ‌ని చెప్పారు.

Next Story