టీవీకే అధినేత విజయ్‌కు చేదు అనుభవం!

by Gantepaka Srikanth |   (  Updated:2026-03-28 15:23:54  IST  )

తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్న నటుడు, తమిళగ వెట్రి కజగం (TVK) వ్యవస్థాపకుడు విజయ్ శనివారం చెన్నై సెక్రటేరియట్‌లో గందరగోళ పరిస్థితుల మధ్య చిక్కుకున్నారు.

టీవీకే అధినేత విజయ్‌కు చేదు అనుభవం!
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్న నటుడు, తమిళగ వెట్రి కజగం (TVK) వ్యవస్థాపకుడు విజయ్ శనివారం చెన్నై సెక్రటేరియట్‌లో గందరగోళ పరిస్థితుల మధ్య చిక్కుకున్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కలిసేందుకు వచ్చిన ఆయనను అభిమానులు, మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో తీవ్రమైన తోపులాట చోటుచేసుకుంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తమ పార్టీకి ఎదురవుతున్న అడ్డంకులపై ఫిర్యాదు చేసేందుకు విజయ్ సెక్రటేరియట్‌కు చేరుకున్నారు. ఆయన వస్తున్నారనే వార్తతో భారీగా తరలివచ్చిన మద్దతుదారులు, కెమెరాలతో దూసుకొచ్చిన మీడియా సిబ్బంది కారణంగా ప్రవేశ ద్వారం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో విజయ్‌ను పలుమార్లు పక్కకు నెట్టడం, ఆయన తోపులాటలో పడిపోవడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెక్యూరిటీ సిబ్బంది ఎంత ప్రయత్నించినా జనాన్ని అదుపు చేయడం కష్టంగా మారింది.

విజయ్ డిమాండ్లు..

ఎన్నికల కమిషనర్‌తో భేటీ సందర్భంగా విజయ్ ప్రధానంగా తమ పార్టీ ప్రచార కార్యక్రమాలపై విధిస్తున్న ఆంక్షల గురించి ప్రస్తావించారు. ఉత్తర చెన్నైలోని పెరంబూర్ వంటి ప్రాంతాల్లో ప్రచార సభల కోసం ముందుగానే దరఖాస్తు చేసుకున్నా, చివరి నిమిషంలో అధికారులు అనుమతి నిరాకరిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. డీఎంకే ప్రభుత్వం కావాలనే అధికారుల ద్వారా తమ ప్రచారాన్ని అడ్డుకుంటోందని, ఇది ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి అని విజయ్ గతంలోనే మండిపడ్డారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో అన్ని పార్టీలకు సమాన అవకాశాలు (Level Playing Field) కల్పించాలని ఆయన కోరారు. అయితే, తాము ఏ పార్టీని లక్ష్యంగా చేసుకోలేదని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు స్పష్టం చేశారు. కొన్ని చోట్ల సాధారణ మరమ్మతు పనులు జరుగుతున్నందున, మరికొన్ని చోట్ల భద్రతా కారణాల దృష్ట్యా రిటర్నింగ్ అధికారులు అనుమతులు నిరాకరించారని, ఇది కేవలం పరిపాలనాపరమైన నిర్ణయమని వారు పేర్కొన్నారు.

డీఎంకే కూటమి సీట్ల సర్దుబాటులో స్టాలిన్ వ్యూహం

Next Story