- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆదిబట్లలో అక్రమ నిర్మాణాల జోరు.. స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం
అక్రమ నిర్మాణాలకు ఆదిబట్ల సర్కిల్ అడ్డాగా మారిందనే ఆరోపణలు రోజురోజుకూ బలపడుతున్నాయి.

దిశ, ఇబ్రహీంపట్నం : అక్రమ నిర్మాణాలకు ఆదిబట్ల సర్కిల్ అడ్డాగా మారిందనే ఆరోపణలు రోజురోజుకూ బలపడుతున్నాయి. అక్రమ నిర్మాణాలు పెరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. భవన నిర్మాణాలకు ఒక విధంగా అనుమతులు పొంది, క్షేత్రస్థాయిలో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతుండటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పట్టణ ప్రణాళిక నిబంధనలు పూర్తిగా ఉల్లంఘనకు గురవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదిబట్ల సర్కిల్ కేంద్రంలోని టీసీఎస్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్, ఫాక్స్‌కాన్, కేయిన్స్ టెక్నాలజీ, వండర్లా వంటి జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఆదిబట్ల సర్కిల్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది యువత ఉద్యోగాల కోసం ఇక్కడికి తరలివచ్చి నివాసల కోసం హాస్టళ్లు, అద్దె గదులు, అపార్ట్మెంట్లను ఆశ్రస్తుండాడం వలన వాటికీ విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకున్న కొందరు బిల్డర్లు అధిక లాభాల కోసం నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పర్మిషన్ ఒకటి.. నిర్మాణం మరొకటి..!
ప్రధానంగా టీసీఎస్ ఎదురుగా ఉన్న శ్రీమిత్ర లేఔట్‌లో భవన నిర్మాణ అనుమతులు ఒక విధంగా తీసుకుని, నిర్మాణాలు మాత్రం మరోవిధంగా చేపడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం 200 గజాల స్థలానికి జి+2 విత్ పెంట్‌హౌస్ నిర్మాణానికి మాత్రమే అనుమతి ఉండగా, అక్కడ జి+4, జి+5 బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే నివాస అవసరాల కోసం అనుమతులు తీసుకుని, అనంతరం వాటిని వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సెట్‌బ్యాక్‌లు, పార్కింగ్ వంటి తప్పనిసరి నిబంధనలను పూర్తిగా విస్మరించి నిర్మాణాలు కొనసాగుతున్నప్పటికీ అధికారులు తనిఖీలు నిర్వహించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. కొందరు బిల్డర్లు అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని ఇష్టారాజ్యంగా భవనాలు నిర్మిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాల పై స్థానికులు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు మాత్రం స్పందించడం లేదని, దీంతో నిబంధనలు పాటించే వారికంటే ఉల్లంఘనలు చేసేవారికే ప్రాధాన్యం లభిస్తున్న పరిస్థితి నెలకొన్నదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనుమతులకు విరుద్ధంగా నిర్మించే భవానలపై చర్యలు తీసుకోవాలి : పల్లె శ్రీనివాస్ గౌడ్
అనుమతులకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాల పై సంబంధిత అధికారులు వెంటనే సమగ్ర విచారణ చేపట్టి, ప్రతినిర్మాణాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, నిబంధనలు ఉల్లంఘించే వారి పై కఠిన చర్యలు తీసుకుంటేనే అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.






