- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్మూర్‌లో హైటెన్షన్.. కాంగ్రెస్–బీజేపీ సవాళ్లతో ఉద్రిక్తత
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో సోమవారం రాజకీయ ఉద్రిక్తత నెలకొంది.

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో సోమవారం రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ముందస్తు చర్యలు చేపట్టారు. పోలీసుల సమాచారం ప్రకారం.. జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు అంకాపూర్ గ్రామంలో భద్రతను కట్టుదిట్టం చేసి, గ్రామానికి వచ్చే అన్ని మార్గాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నివాసం వద్ద కూడా భారీగా పోలీసులను మోహరించారు.
ముందస్తు చర్యలు.. పలువురు నాయకుల గృహనిర్బంధం..
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని ఆయన నివాసంలో, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిని ఆర్మూర్‌లోని పీవీఆర్ భవన్‌లో గృహనిర్బంధం చేశారు. అలాగే ఇరు పార్టీలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
బీజేపీ ఆరోపణలు..
అంకాపూర్‌లో విలేకరులతో మాట్లాడిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. కళ్యాణలక్ష్మి పథకంలో బంగారం, మహిళలకు స్కూటీల పంపిణీ వంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి మాట్లాడుతూ.. ఆర్మూర్ అభివృద్ధిని ఎవరు అడ్డుకుంటున్నారో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రతిస్పందన..
గృహనిర్బంధంలో ఉన్న కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 15న జరిగిన బీజేపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలే "చలో అంకాపూర్" కార్యక్రమానికి కారణమని తెలిపారు. ఆర్మూర్‌లో రాజకీయ బలం ఎవరిదో స్థానిక ఎన్నికల ఫలితాలే నిరూపించాయని అన్నారు.
అప్రమత్తంగా పోలీసులు..
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంకాపూర్ గ్రామంలో పోలీసులు నిరంతరం పహారా నిర్వహించారు. గ్రామానికి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేయడంతో పాటు, చట్టవ్యవస్థకు భంగం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.






