- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలియో దీదీ.. సైకిల్‌పై 40ఏళ్ల సేవలు..
ఆదివాసి కుటుంబాలను ఆస్పత్రి వైద్యానికి దగ్గరగా చేర్చింది ఈ నర్స్. డెలివరీ సమయంలో ఏ తల్లి కూడా చనిపోకుండా చేయాలనుకుంది. ఇలా దాదాపు 40 ఏళ్ల పాటు తండాల్లోకి సైకిల్‌పై ప్రయాణించి.. అవగాహన కల్పించింది.

దిశ, ఫీచర్స్ : ఆదివాసి కుటుంబాలను ఆస్పత్రి వైద్యానికి దగ్గరగా చేర్చారు ఈ నర్స్. డెలివరీ సమయంలో ఏ తల్లి కూడా చనిపోకుండా చేయాలనుకున్నారు. ఇలా దాదాపు 40 ఏళ్ల పాటు తండాల్లోకి సైకిల్‌పై ప్రయాణించి.. అవగాహన కల్పించారు. దేశంలోనే అత్యుత్తమ అవార్డును అందుకున్న సమయంలో.. ఇదంతా నిజమేనా.. అని కన్నీరు పెట్టుకున్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని బెలకోబా రూరల్ హాస్పిటల్ నుంచి రిటైర్ అయిన హెల్త్ సూపర్ వైజర్ గీతా కర్మార్కర్‌కు కొన్ని క్షణాలు మాటలు రాలేదు. కారణం నర్సింగ్ వృత్తికి దేశంలోనే అత్యుత్తమమైన ‘నేషనల్ ఫ్లారెన్స్ నైటింగేల్ అవార్డు 2026’ వచ్చినట్లు తెలపడమే. ఆమె మొదట్లో ఇదంతా జోక్ అనుకుంది. కానీ అధికారి ఈ వార్త నిజమని ధృవీకరించారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో అవార్డు అందజేస్తారని చెప్పారు. కాల్ తర్వాత ఈ మెయిల్ కూడా వచ్చింది. చాలా సంతోషించింది. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. మరుసటి రోజు ఆమె తల్లి మరణించారు. మూడు వారాల కంటే తక్కువ సమయంలో.. దుఃఖం, కృతజ్ఞతలతో ఢిల్లీ వెళ్లి ఆమె ఆశించని ఈ గౌరవం అందుకున్నారు.
అవగాహన శూన్యం
మే 12, 2026న రాష్ట్రపతి భవన్‌లో గీతాకు అవార్డు అందించారు. ఆమెకు ఇది అవాస్తవికంగా అనిపించింది. ఈ గౌరవం ఉత్తర పశ్చిమ బెంగాల్‌లో అత్యంత వెనుకబడిన సమాజాలకు 40 ఏళ్లకు పైగా సేవ చేసిన ఫలితం. గీతా 1983లో జల్పాయిగురిలో నర్సింగ్ శిక్షణ పూర్తి చేసి హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో చేరారు. మొదటి పోస్టింగ్ బెలకోబా రూరల్ హాస్పిటల్‌లో అనుబంధ నర్సు. కొద్ది రోజుల్లోనే దంగువాజ్‌హార్ టీ గార్డెన్‌కు బదిలీ అయ్యారు. ఇక్కడ చాలా మంది ఆదివాసులు ఉంటారు. ఆరోగ్య సౌకర్యాలు చాలా తక్కువ, ఆసుపత్రి సేవల గురించి అవగాహన దాదాపు లేదు.
కుర్చీ టేబుల్‌తోనే క్లినిక్
సవాళ్లు తక్షణం ఎదురయ్యాయి. ఆ ప్రాంతంలో హెల్త్ సెంటర్ లేదు. మొదటి రెండు సంవత్సరాలు మార్కెట్ వెరాండాలో కుర్చీ, టేబుల్‌తో క్లినిక్ నడిపారు. చాలా ప్రసవాలు ఇంట్లోనే జరిగేవి. టీకాలు తక్కువ. పిల్లల్లో పోషకాహార లోపం సాధారణం. అనారోగ్యాలకు సాంప్రదాయ వైద్యులను ఆశ్రయించేవారు. దీంతో ప్రతి రోజు గీతా 12-14 కి.మీ. సైకిల్‌పై ఇంటింటికి తిరిగి.. వైద్య సహాయం తీసుకోమని ఒప్పించేవారు. కాలక్రమేణా ప్రజలు ఆమెను ‘పోలియో దీదీ’, ‘మా’ అని పిలవసాగారు. అధికారికంగా టీ గార్డెన్ జనాభా 3,000 మంది అని చెప్పేవారు. కానీ గీతా ఇంటి ఇంటికి సర్వే చేసి 5,500 మంది ఉన్నట్టు కనుగొన్నారు.
ఆస్పత్రి ప్రసవాలు మొదలు
ఇంటి ప్రసవాల నుంచి ఆసుపత్రి ప్రసవాల వైపు మార్చడం గీతా ప్రధాన సవాలు. స్థానిక హెల్త్ వర్కర్లతో కలిసి సంవత్సరాలు కుటుంబాలను సందర్శించి, భయాలను తొలగించి, ఆసుపత్రి ప్రయోజనాలు వివరించారు. ఇంటి ప్రసవాల్లో ఇన్ఫెక్షన్ ప్రమాదం ఎక్కువ. పాత గుడ్డలు, కత్తి ముక్కతో నాభిరేఖ కత్తిరిస్తే ఎంత ప్రమాదమో.. భయపెట్టకుండా, ఓపిగ్గా వివరించేవారు. గర్భిణులతో మాట్లాడి.. భర్తలు, పెద్దలు, అత్తలను కూడా ఒప్పించేవారు. బిడ్డ ఊపిరి తీసుకోలేకపోతే ఆసుపత్రిలో ఆక్సిజన్, మందులు ఉంటాయని చెప్పేవారు.
డ్యూటీ కాదు బాధ్యత
ప్రభుత్వ డ్యూటీ సమయం 9 గంటల నుంచి 3 గంటల వరకు అయినా.. టీ గార్డెన్ మహిళలు 7 గంటల వరకు పని చేసేవారు కాబట్టి సాయంత్రం 5-6 గంటల వరకు ఉండేవారు. దూర ప్రాంతాల్లో భద్రతా సమస్యలు ఉన్నా.. రాతపూర్వక అనుమతి తీసుకొని పని చేశారు. ప్రతి కుటుంబ వివరాలు రిజిస్టర్‌లో రాసి.. చదివి వినిపించి.. వేలి ముద్ర వేయించేవారు. బుధవారం టీకా రోజు కానీ మహిళలు పని వదిలి రాలేకపోవడంతో టీకాలు తీసుకెళ్లి గార్డెన్లలోనే ఇచ్చేవారు. దీంతో అందరూ ఆమెను ‘పోలియో దీదీ’ అనే పిలిచేవారు. ఆసుపత్రిలో సురక్షితంగా ప్రసవించిన మహిళలు ఇతరులకు చెప్పడంతో వైఖరి మారింది. ఇంటి ప్రసవాలు దాదాపు అంతరించిపోయాయి. సంవత్సరానికి సగటున 100 ఆసుపత్రి ప్రసవాలు జరిగేవి. 2014 నాటికి ఆమె సర్వీస్ ఏరియాలో ఇంటి ప్రసవాలు దాదాపు లేవని స్థానికులు చెప్పారు. ఇక 2021లో హెల్త్ సూపర్‌వైజర్‌గా ప్రమోషన్ పొందిన ఆమె.. 2026 జనవరి 31న 42 ఏళ్ల సర్వీస్ తర్వాత రిటైర్ అయ్యారు. గీతా కర్మార్కర్ కథ.. సేవ, ఓపిక, కరుణకు ఉదాహరణ. కాగా ఆమె కృషి వల్ల ఎందరో తల్లులు, బిడ్డలు సురక్షితంగా ఉన్నారనేది వాస్తవం. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆమె సేవను గుర్తించి సత్కరించింది.






