- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాల్లో మూడు గంటల నరకం.. ప్రాణ భయంతో ప్రయాణికుల హాహాకారాలు, ప్రార్థనలు
హైదరాబాద్ నుంచి హుబ్లీ వెళ్తున్న ‘ఫ్లై 91’ (Fly91) విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నుంచి హుబ్లీ వెళ్తున్న ‘ఫ్లై 91’ (Fly91) విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రతికూల వాతావరణం, సాంకేతిక సమస్యల కారణంగా విమానం గాల్లోనే సుమారు మూడు గంటలపాటు చక్కర్లు కొట్టడంతో ప్రయాణికులు ప్రాణ గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఏ క్షణాన ఏమవుతుందోనన్న భయంతో ప్రయాణికులు హాహాకారాలు, ప్రార్థనలు చేశారు. చివరకు అధికారులు విమానాన్ని సురక్షితంగా బెంగళూరుకు మళ్లించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అసలేం జరిగిందంటే.. ఆదివారం సాయంత్రం 3:30 గంటలకు 22 మంది ప్రయాణికులతో ఫ్లై 91 విమానం హైదరాబాద్‌లో బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు ఇది కర్ణాటకలోని హుబ్లీ చేరుకోవాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలించక పోవడం, దానికి తోడు గాల్లో ఉండగానే సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విమానం ల్యాండ్ కాలేకపోయింది. విమానాన్ని అలాగే సుమారు మూడు గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టించారు. దీంతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కొందరు భయంతో బిగ్గరగా ఏడుస్తూ, క్షేమంగా కిందకు దిగాలని దేవుడిని ప్రార్థించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
పరిస్థితిని అంచనా వేసిన అధికారులు విమానాన్ని వెంటనే బెంగళూరుకు దారి మళ్లించారు. అక్కడ సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత, తిరిగి అదే రోజు సాయంత్రం 6.30 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి రాత్రి 11 గంటలకు హుబ్లీ చేరుకుంది. విమానంలోని 22 మంది ప్రయాణికులు పూర్తిగా సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.
గోవాకు మరో విమానం మళ్లింపు
ఇదిలా ఉండగా, వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో ముంబై నుంచి కొల్హాపూర్ వెళ్లాల్సిన మరో విమానాన్ని కూడా దారి మళ్లించాల్సి వచ్చింది. ఈ విమానాన్ని అధికారులు గోవాకు మళ్లించారు. అయితే ఈ విమానంలో ఎలాంటి సాంకేతిక సమస్యా తలెత్తలేదని, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.






