E20 వివాదం: న్యాయపోరాటానికి దిగిన నితిన్ గడ్కరీ.. హైకోర్టు కీలక నిర్ణయం

by Prasad Jukanti |   (  Updated:2026-07-27 13:07:54  IST  )

E20 విధానంతో ముడిపెడుతూ వస్తున్న AI డీప్‌ఫేక్ వీడియోలపై మెటా, గూగుల్, X లపై దావా వేసేందుకు నితిన్ గడ్కరీకి బాంబే హైకోర్టు అనుమతి ఇచ్చింది.

E20 వివాదం: న్యాయపోరాటానికి దిగిన నితిన్ గడ్కరీ.. హైకోర్టు కీలక నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (E20) పాలసీ నుంచి తన కుటుంబం అక్రమంగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతోందంటూ సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న AI డీప్‌ఫేక్ వీడియోలు, తప్పుడు ప్రచారాలపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ న్యాయపోరాటానికి దిగారు. దిగ్గజ సోషల్ మీడియా సంస్థలైన మెటా, గూగుల్, X (ట్విట్టర్)లతో పాటు పలువురు అజ్ఞాత వ్యక్తులపై పరువు నష్టం దావా వేసేందుకు ఆయనకు బాంబే హైకోర్టు సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 'లెటర్స్ పేటెంట్' క్లాజ్ XII కింద జస్టిస్ అభయ్ అహుజా ధర్మాసనం గడ్కరీకి ఈ దావా వేసేందుకు అనుమతి మంజూరు చేసింది. తదుపరి విచారణలో కంటెంట్ తొలగింపు (తొలగించే ఆదేశాలు) అంశాన్ని విచారించే అవకాశముంది.

ఈ20 విధానంతో సంబంధం లేదు:

2003లో ప్రారంభమైన ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ (EBP) ఇటీవల అమలులోకి వచ్చిన 20 శాతం ఎథనాల్ మిశ్రమం (E20) అంతా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశమని గడ్కరీ స్పష్టం చేశారు. 2014 నుండి తాను రోడ్డు రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ, E20 విధాన నిర్ణయాల్లో తన పాత్ర ఏమీ లేదని పేర్కొన్నారు. E20 ప్రాజెక్టు ద్వారా తాను, తన కుటుంబ సభ్యులు అక్రమ సంపాదన పొందారని ఆరోపిస్తూ AI ఆధారిత డీప్‌ఫేక్ వీడియోలు, ఎడిట్ చేసిన క్లిప్పులు ప్రచారం చేస్తున్నారని విచారణలో వెల్లడించారు. తన ప్రతిష్టను దిగజార్చేలా ఉన్న కనీసం 24 పోస్టులను వెంటనే ఇంటర్నెట్ నుంచి తొలగించాలని కోరారు. ఈ కేసులో ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) లను కూడా ప్రతివాదులుగా చేర్చారు.

విమర్శలను అడ్డుకోవడం కాదు:

ప్రజలు తన పనితీరుపై చేసే నిర్మాణాత్మక విమర్శలను, చర్చలను అడ్డుకోవడం తన ఉద్దేశం కాదని ఈపిటిషన్ లో నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. కేవలం అసత్య ఆధారాలతో, దురుద్దేశపూర్వకంగా చేసిన AI డీప్‌ఫేక్ ప్రచారాన్ని నిరోధించడమే తన లక్ష్యమని పిటిషన్‌లో స్పష్టం చేశారు. E20 విధానాన్ని రూపొందించడంలో గానీ అమలు చేయడం, నిర్వహించడంలో గానీ తనకు ఎలాంటి పాత్ర లేదని గడ్కరీ స్పష్టం చేశారు. తనను మరియు తన కుటుంబాన్ని E20 కార్యక్రమంతో తప్పుగా ముడిపెడుతూ AI ద్వారా సృష్టించబడిన డీప్‌ఫేక్ వీడియోలు, ఎడిట్ చేసిన క్లిప్‌లు, సంబంధిత పోస్టులను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుండి తక్షణమే తొలగించాలని ఈ దావాలో ఆయన కోరారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో పరువు నష్టం కలిగించేదిగా ఆరోపించబడుతున్న కంటెంట్‌ను సృష్టించడం, ప్రచురించడం మరియు వ్యాప్తి చేయడం వంటి వాటికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని గడ్కరీ కోరారు.

Lok Sabha: యాంటీ-పేపర్‌ లీక్‌ బిల్లుపై చర్చకు టైమ్ ఫిక్స్.. లోక్‌సభ రేపటికి వాయిదా

Next Story