- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికా, ఇజ్రాయెల్‌ను ఎదుర్కొనేందుకు జిహాద్ ప్రతిఘటనే మార్గం.. మొజ్తబా ఖమేనీ సంచలన ప్రకటన
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలను ఎదుర్కొనేందుకు ‘జిహాద్, ప్రతిఘటన’ తప్ప మరో మార్గం లేదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా మొజ్తబా ఖమేనీ స్పష్టం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా, ఇజ్రాయెల్ దేశాలను ఎదుర్కొనేందుకు ‘జిహాద్, ప్రతిఘటన’ తప్ప మరో మార్గం లేదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా మొజ్తబా ఖమేనీ స్పష్టం చేశారు. లెబనాన్‌కు చెందిన సాయుధ సంస్థ హిజ్బుల్లాకు ఆయన ఇరాన్ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌కు విధేయత ప్రకటిస్తూ హిజ్బుల్లా రాసిన లేఖకు బదులుగా ఖమేనీ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఈ సందేశాన్ని ఇచ్చారు.
అమెరికాతో వైరం ముగిసేది అప్పుడే..
లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైనిక దాడులను బేషరతుగా, పూర్తిగా నిలిపివేసినప్పుడే అమెరికాతో ఇరాన్‌కు ఉన్న సంఘర్షణ ముగుస్తుందని మొజ్తబా ఖమేనీ తేల్చిచెప్పారు. హిజ్బుల్లా ఫైటర్లను రక్షించుకోవడం ఇరాన్ వ్యూహాత్మక బాధ్యత అని స్పష్టం చేశారు. తన తండ్రి, మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అనుసరించిన విధానాలనే తానూ కొనసాగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అమెరికా, ఇజ్రాయెల్ అకృత్యాలతో ప్రపంచం విసిగిపోయిందని.. ఈ తరుణంలో ఇజ్రాయెల్ దురాక్రమణకు వ్యతిరేకంగా అచంచలమైన శిలలా పోరాడుతున్న హిజ్బుల్లా, ప్రపంచ దేశాలకు ఒక స్ఫూర్తిగా నిలిచిందని కొనియాడారు.
నస్రల్లాకు నివాళి..
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన హిజ్బుల్లా మాజీ చీఫ్ హసన్ నస్రల్లాతో పాటు ఇతర ఫైటర్ల త్యాగాలను ఆయన స్మరించుకున్నారు. వారి ప్రాణత్యాగాల వల్ల ఒక చిన్న మొక్కలా ఉన్న హిజ్బుల్లా.. ఇప్పుడు ఇస్లామిక్ ప్రపంచంలో మహా వృక్షంలా ఎదిగిందని కీర్తించారు. హిజ్బుల్లా ప్రస్తుత సెక్రటరీ జనరల్ షేక్ నయీం ఖాసింను, ఫైటర్లను ఉద్దేశించి చేసిన ఈ ప్రకటనలో.. అంతిమ విజయం హిజ్బుల్లాదేనని ఖమేనీ ఆశాభావం వ్యక్తం చేశారు. లెబనాన్ పౌరులు, అమరుల కుటుంబాల కోసం ఆయన ప్రార్థనలు చేశారు.






