ఫ్రెండ్స్.. సబ్బు నురగతో మోడీ లుక్.. చిన్నారి పేరడీతో పాటు నెట్టింట పేలుతున్న మీమ్స్

by Ramesh Naini |

ఫ్రెండ్స్.. సబ్బు నురగతో మోడీ లుక్.. చిన్నారి పేరడీతో పాటు నెట్టింట పేలుతున్న మీమ్స్
X

‘ఫ్రెండ్స్...’ అంటూ మోడీ వీడియో వైరల్.. చిన్నారి పేరడీతో నెట్టింట పేలుతున్న మీమ్స్

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘నీట్’ (NEET) పేపర్ లీకేజ్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అర్థరాత్రి పూట మోడీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘ఫ్రెండ్స్’ అంటూ పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియో ఒకవైపు రికార్డులు సృష్టిస్తుంటే.. మరోవైపు కంటెంట్ క్రియేటర్లు, మీమర్లు, జెన్-జీ (Gen-Z) నెటిజన్లకు ఫుల్ మీల్స్ పెడుతోంది. సెలబ్రిటీల విమర్శలు, రాజకీయ పరిణామాలు, ట్రోల్స్‌తో ఈ వ్యవహారం వెబ్ దద్దరిల్లేలా చేస్తోంది.

రికార్డులు బద్దలు కొట్టిన రీల్..

సాధారణంగా కీలక వివాదాల సమయంలో మౌనంగా ఉంటారనే విమర్శలు ఎదుర్కొనే ప్రధాని మోడీ.. నీట్ నిరసనల వేళ 24 గంటల్లోనే రెండు వీడియోలు విడుదల చేశారు. అందులో ముఖాన్ని కెమెరాకు అతి దగ్గరగా పెట్టి (క్లోజప్ యాంగిల్) ఆయన మాట్లాడిన సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది. డీడీ న్యూస్ ప్రకారం ఈ వీడియో ఏకంగా 303 మిలియన్ల వ్యూస్ సాధించి ప్రపంచంలోనే అత్యధిక వీక్షణలు పొందిన రీల్‌గా వరల్డ్ రికార్డు సృష్టించింది. కానీ, ఈ వీడియో కంటెంట్ కంటే కూడా ప్రధాని కెమెరా యాంగిల్, ఆయన వాడిన పదాలే నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

‘టాక్సిక్ బాయ్‌ఫ్రెండ్’ అంటూ జెన్-జీ సెటైర్లు

‘ఫ్రెండ్స్... ఏ పేపర్ లీకేజ్ విషయ్ మామూల్ విషయ్ నయి హై’ అంటూ మోడీ మాట్లాడిన తీరును నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. రోజంతా కనిపించకుండా అర్థరాత్రి మెసేజ్ చేసే ఎమోషనల్లీ అన్‌అవైలబుల్ పార్ట్‌నర్ టెంప్లేట్‌ను మోడీ వీడియోకు జతచేశారు. ‘మెన్ ఎట్ 12 AM’, ‘టాక్సిక్ బాయ్‌ఫ్రెండ్ నుంచి మిడ్‌నైట్ మెసేజెస్’ అంటూ యువత కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడూ వాడే ‘మిత్రోం’ (Mitron) కు బదులు ‘ఫ్రెండ్స్’ అనడంపై ఆందోళనకారులు సెటైర్లు వేశారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు.. ‘మేము నీకు ఫ్రెండ్స్ కాదు (I'm not your friend)’ అంటూ మోడీ ఫోటోలతో కూడిన ప్లకార్డులు పట్టుకుని నిరసనలు తెలిపారు.

చిన్నారి అనుకరణ..

ఓ చిన్న పిల్లాడు స్నానం చేస్తూ.. సబ్బు నురగతో గడ్డం ఆకృతిని క్రియేట్ చేసుకుని అచ్చం మోడీలాగే ఇమిటేట్ చేసిన వీడియో నెట్టింట విపరీతంగా ఆకట్టుకుంటోంది. సబ్బు నురగతో మోడీ లుక్ చూసి నెటిజన్‌లు పిల్లాడిని అభినందించారు.

ఇన్‌ఫ్లుయెన్సర్ కంటెంట్‌లా రివ్యూలు

ఈ వీడియోను యూత్‌ ఒక పొలిటికల్ మెసేజ్‌లా కాకుండా, ఇన్ స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ రీల్ లాగా రివ్యూ చేయడం గమనార్హం. ‘స్టార్టింగ్ హుక్ బాగాలేదు’, ‘బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లేదు’, ‘ఎడిటింగ్ చాలా వీక్.. దయచేసి నన్ను పనిలోకి తీసుకోండి’ అంటూ క్రియేటర్లు కామెంట్ సెక్షన్‌లో సెటైర్లు పేలుస్తున్నారు. ‘మోడీ జీ మీరే నా ఫేవరెట్ ఇన్‌ఫ్లుయెన్సర్’ అని కొందరు కామెంట్ చేస్తుంటే.. ఆ కామెంట్స్ చదివే మోడీ సోషల్ మీడియా టీమ్ తమ రెండో వీడియోలో ‘క్లోజప్ యాంగిల్’ మార్చేసిందని మరికొందరు సరదాగా కామెంట్ చేస్తున్నారు.

క్లైమాక్స్: మంత్రి రాజీనామా!

ఒకవైపు మోడీ వీడియోపై మీమ్స్ ప్రవాహం కొనసాగుతుండగానే.. నిరసనకారుల ప్రధాన డిమాండ్ నెరవేరింది. శనివారం నాడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. రాజకీయంగా ఇది ఒక పెద్ద బ్రేక్ త్రూ అయినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం మోడీ ‘ఫ్రెండ్స్’ మీమ్ ఫెస్ట్ ఇంకా ట్రెండింగ్‌లోనే ఉండటం విశేషం.

Next Story