- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.1.95 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కూనంనేని శంకుస్థాపన
సుజాతనగర్ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, కొత్తగూడెం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.

దిశ, కొత్తగూడెం టౌన్: సుజాతనగర్ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, కొత్తగూడెం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం సుజాతనగర్ కార్పొరేషన్ పరిధిలో రూ.1.95 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మరుగుదొడ్లు, బస్ షెల్టర్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, సుజాతనగర్ కార్పొరేషన్‌లో విలీనమైన తర్వాత మౌలిక వసతుల అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయించామని తెలిపారు. ప్రతి గ్రామంలో తాగునీరు, వీధి దీపాలు, డ్రైనేజీ వంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సుజాతనగర్ నుంచి శివాలయం వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు.
అభివృద్ధి పనులు కొనసాగిస్తూ..
సుజాతనగర్‌లో మున్సిపల్ సబ్-డివిజన్ కార్యాలయం ఏర్పాటు, సింగభూపాలెం చెరువు కట్ట అభివృద్ధికి రూ.5.5 కోట్ల నిధులు మంజూరు కానున్నాయని తెలిపారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ (న్యాక్) కేంద్రాన్ని మంజూరు చేయించామని, నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తూ, పార్టీలకతీతంగా ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, సొసైటీ అధ్యక్షులు మండే హనుమంతరావు, టీపీసీసీ సభ్యులు నాగ సీతారాములు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వీరబాబు, మున్సిపల్ కమిషనర్ సుజాత, కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి, తహసీల్దార్ కృష్ణప్రసాద్, ఎంపీడీఓ భారతి, ఏఓ నర్మద, విద్యుత్ శాఖ ఏఈ కిషన్, సీపీఐ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.






