- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
E20 Janta Party: కొత్తగా 'ఈ20 జనతా పార్టీ' ఉద్యమం మొదలు
తాము ఇథనాల్ వాడకానికి పూర్తిగా వ్యతిరేకం కాదని, బంకుల్లో ఈ20తో పాటు 100 శాతం స్వచ్ఛమైన పెట్రోల్‌ను కూడా అందుబాటులో ఉంచి, తమ వాహనాలకు ఏది అనుకూలమో ఎంచుకునే స్వేచ్ఛను వినియోగదారులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.

దిశ, నేషనల్ బ్యూరో: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో విజయం సాధించిన సీజేపీ తరహాలో కొత్త ఉద్యమం ఒకటి మొదలైంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 20 శాతం ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ (ఈ20) విధానానికి వ్యతిరేకంగా 'ఈ20 జనతా పార్టీ' పేరుతో ఒక సరికొత్త పౌర ఉద్యమం సోషల్ మీడియాలో పుట్టింది. ఈ గ్రూప్ ఇప్పుడు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజీనామాను డిమాండ్ చేస్తోంది. తాము ఇథనాల్ వాడకానికి పూర్తిగా వ్యతిరేకం కాదని, బంకుల్లో ఈ20తో పాటు 100 శాతం స్వచ్ఛమైన పెట్రోల్‌ను కూడా అందుబాటులో ఉంచి, తమ వాహనాలకు ఏది అనుకూలమో ఎంచుకునే స్వేచ్ఛను వినియోగదారులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ప్రచారానికి మద్దతుగా ఢిల్లీ ట్యాక్సీ, ట్రాన్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆగస్టు 4న పార్లమెంట్ వైపు మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించడంతో ఈ అంశం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయింది.
పెరుగుతున్న ఆన్‌లైన్ మద్దతు
ఇన్‌స్టాగ్రామ్‌లో 4.09 లక్షలకు పైగా ఫాలోవర్లు, 'ఎక్స్' లో కొద్ది గంటల్లోనే 54 వేల మందికి పైగా మద్దతుదారులను కూడగట్టుకుని ఈ డిజిటల్ ప్రచారం వేగంగా విస్తరిస్తోంది. ఇంధన మిశ్రమాలపై స్పష్టమైన లేబులింగ్ ఉండాలని, వివిధ ఇంధనాల ఖర్చులు, మైలేజ్, ఉద్గారాలు, ఇంజిన్ దీర్ఘకాలిక మన్నికపై పారదర్శకమైన అధ్యయనం వెల్లడించాలని ఈ గ్రూప్ కోరుతోంది. కాక్రోజ్ జనతా పార్టీ(సీజేపీ)ని ఆదర్శంగా తీసుకున్న ఈ కొత్త గ్రూప్, తమది రాజకీయ పార్టీ కాదని, వినియోగదారుల హక్కుల కోసం సామాన్య పౌరులే నడిపిస్తున్న ఉద్యమం అని చెబుతోంది. ఇతర వస్తువులను ఎంచుకునే హక్కు పౌరులకు ఉన్నట్లే, తమ వాహనాల్లో ఏ ఇంధనం పోయించుకోవాలో నిర్ణయించుకునే హక్కు కూడా వినియోగదారులకే ఉండాలని 'ఈ20 జనతా పార్టీ' స్పష్టం చేస్తోంది.






