రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలి : కలెక్టర్ కుమార్ దీపక్

by Batti.Sumithra |

వర్షాకాల ఖరీఫ్ సీజన్‌లో నెలకొన్న ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించేందుకు రైతులు వరి సాగు మినహా ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టి లబ్ధి పొందాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.

రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలి : కలెక్టర్ కుమార్ దీపక్
X

దిశ, మంచిర్యాల : వర్షాకాల ఖరీఫ్ సీజన్‌లో నెలకొన్న ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించేందుకు రైతులు వరి సాగు మినహా ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టి లబ్ధి పొందాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని బెల్లంపల్లి, గురిజాల, భీమారం మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన విత్తనాల పంపిణీ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి సురేఖతో కలిసి హాజరయ్యారు. రైతు వేదికలో రైతులకు అవగాహన కల్పించేందుకు ఉంచిన కూరగాయల విత్తనాలను పరిశీలించారు. టమాటా, బెండ, బీర, చిక్కుడు, మిరప, సొర విత్తనాల ప్యాకెట్లకు సంబంధించిన బ్రాండ్లు, కంపెనీ, నాణ్యత ప్రమాణాల వివరాలను వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బయో కంపోస్ట్ ఎరువుల వినియోగంపై కూడా ఆరా తీశారు. అనంతరం పలు సూచనలు చేశారు. ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటివరకు జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. రాబోయే మూడు నెలల వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందన్నారు.

నీటి లభ్యతలో లోటు ఉన్నందున వరి సాగుతో నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. నీటి ఇబ్బందుల కారణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలన్నారు. భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలని సూచించారు. పప్పుధాన్యాలు, పత్తి, కూరగాయలు, ఆయిల్ పామ్ వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. అవసరమైన రాయితీ విత్తనాలు, ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. భూసార పరీక్షలు నిర్వహించి కార్డులు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. పంటల సాగుకు అనుగుణంగా యూరియా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆసుపత్రిలోని వార్డులు, మందుల నిల్వలు, ల్యాబ్, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ప్రత్యేక సమగ్ర సవరణపై దృష్టి సారించాలని సూచించారు. సాదా బైనామా, భూ భారతి, రెవెన్యూ సదస్సులకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియపై ఆరా తీశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ కృష్ణ, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు ఉన్నారు.

Next Story