పాలమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ వైద్యం : ఎమ్మెల్యే

by Taduka Kalyani |

పాలమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ వైద్యం అందుబాటులో ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

పాలమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ వైద్యం : ఎమ్మెల్యే
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి: పాలమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ వైద్యం అందుబాటులో ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో 15 లక్షల ముడా నిధుల వ్యయం తో కొనుగోలు చేసిన అధునాతన శస్త్రచికిత్స పరికరాలను ఆయన ఆసుపత్రికి అందజేసి మాట్లాడారు. గర్భిణీ స్త్రీలు, తల్లులు, శిశువులకు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు సమయానికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని, డెలివరీ కోసం వచ్చే మహిళలకు అవసరమైన ఎక్విప్మెంట్, మందులు, వైద్య సేవలు అందుబాటులో ఉంచుతున్నామని ఆయన పేర్కొన్నారు. డాక్టర్లు, నర్సులు, ఆశా వర్కర్లకు విశ్రాంతి సదుపాయాలు కల్పించడం తో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు కూడా మెరుగైన సేవలు అందిస్తున్నామని వెల్లడించారు.

ఆసుపత్రిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎక్కడపడితే అక్కడ చెత్త వేయడం, పాన్ వాడకం వంటి చర్యలను నివారించాలని ఆయన సూచించారు. డెలివరీ వార్డులో అనవసర రద్దీ లేకుండా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి వారం శుభ్రత, మరమ్మత్తు పనులు చేపడుతూ రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. శిశువుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆసుపత్రి నియమాలను అందరూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే పట్టణంలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రంగ అజ్మీరా, కార్పొరేటర్లు సల్మాన్, షబ్బీర్ అహ్మద్, రమేష్ రెడ్డి, ఫక్రూ, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు రాఘవేందర్, సాదుల్లా, తదితరులు పాల్గొన్నారు.

Next Story