- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐటీడీఏ ఏరియా ఆస్పత్రులకు దశలవారీగా సీటీ స్కాన్ సేవలు
గిరిజన, అటవీ ప్రాంత ప్రజలకు నగరాల స్థాయి వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: గిరిజన, అటవీ ప్రాంత ప్రజలకు నగరాల స్థాయి వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఐటీడీఏ పరిధిలోని అన్ని ఏరియా ఆస్పత్రుల్లో దశలవారీగా సీటీ స్కాన్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. సోమవారం సచివాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఆదిలాబాద్ రిమ్స్‌తో పాటు ఆసిఫాబాద్, నిర్మల్ ప్రభుత్వ వైద్య కళాశాలలు, జిల్లా, ఏరియా ఆస్పత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల పనితీరును సమీక్షించారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజలు ప్రయాణించాల్సిన దూరాన్ని పరిగణనలోకి తీసుకుని కొత్త సబ్‌సెంటర్లు, పీహెచ్‌సీలు ఏర్పాటు చేయడంతో పాటు అవసరానికి అనుగుణంగా ఆస్పత్రులను అప్‌గ్రేడ్ చేస్తామని తెలిపారు.
ఆదిలాబాద్ రిమ్స్‌ను ఉమ్మడి జిల్లాకు ప్రధాన వైద్య కేంద్రంగా తీర్చిదిద్దుతూ కార్డియాలజీ, నెఫ్రాలజీ తదితర సూపర్ స్పెషాలిటీ సేవలను విస్తరిస్తామని చెప్పారు. క్లిష్ట చికిత్సల కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా జిల్లాల్లోనే నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మలేరియా, డెంగీ, వైరల్ జ్వరాలు, డయేరియా వంటి సీజనల్ వ్యాధుల నియంత్రణపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మండలానికి అంబులెన్స్ మంజూరు చేసిన ప్రభుత్వం త్వరలో సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులకు అదనపు అంబులెన్స్‌లను కూడా అందుబాటులోకి తీసుకురానుందని తెలిపారు. 108, 102 అంబులెన్స్ సేవలు నిరంతరాయంగా కొనసాగడంతో పాటు హైరిస్క్ గర్భిణులను ప్రసవ తేదీకి ముందే బర్త్ వెయిటింగ్ రూమ్‌లకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.






