ఢిల్లీ బ్లాస్ట్ వెనుక టెలిగ్రామ్! తెరపైకి విస్తుపోయే విషయాలు

by Prasad Jukanti |   (  Updated:2025-11-11 11:43:07  IST  )

ఢిల్లీ పేలుడు ఘటన వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఢిల్లీ బ్లాస్ట్ వెనుక టెలిగ్రామ్! తెరపైకి విస్తుపోయే విషయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో నిన్న సాయంత్రం జరిగిన పేలుడు (Delhi Red Fort) ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఈ ఘటనపై దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేలుడుకు కారణమైన ఐ20 కారు కేసులో కీలక ఆధారంగా మారింది. కారు నడుపుతున్న వ్యక్తి డాక్టర్ ఉమర్ నబీ అని పోలీసులు అనుమానిస్తుండగా ఈ పేలుడు వెనుక జరిగిన కుట్ర కోణంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌తో లింక్ (Telegram link) ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డాక్టర్ ఉమర్ మొహ్మద్ నబీ టెలిగ్రామ్ యాప్‌లో రాడికల్ డాక్టర్ల సమూహంలో సభ్యుడిగా ఉన్నట్లు ఢిల్లీ పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ఉమర్ నబీ పాకిస్తాన్‍కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌తో సంబంధాలు కలిగి ఉన్నాడని తెలిపారు. నిషేధిత జైషే మహ్మద్, అన్సార్ గజ్ వత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న 8 మందిని నిన్న అరెస్టు చేసినట్టు జమ్మూకశ్మీర్ పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. వీరిలో ముగ్గురు అదీల్ అహ్మద్, ముజమ్మిల్ షకీల్, షాహిన్ డాక్టర్లు. వీరితో ఉమర్ నబీకి సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. అయితే వారం క్రితం గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్టు చేసిన సయ్యద్ పాకిస్తాన్ నుంచి ఉగ్ర సమాచారం కోసం ఎన్‌క్రిప్టెడ్ యాప్స్ వినియోగించినట్లు గుజరాత్ ఏటీసీ దర్యాప్తులో తేలింది. తాజాగా ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనలో కీలక అనుమానితుడిగా ఉన్న డాక్టర్ ఉమల్ మొహ్మద్ నబీ నెట్‌వర్క్ అంతా టెలిగ్రామ్ ద్వారా జరిగిందని అనుమానిస్తున్నారు.

ఇక్కడే యాక్షన్ ప్లాన్స్..

టెలిగ్రామ్ విషయంలో చాలాకాలంగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ యాప్ ఎక్కువ అశ్లీలత వీడియోలు, చైల్డ్ పోర్న్ కంటెంట్‌తోపాటు మహిళల అక్రమ రవాణా, హనీ‌ట్రాప్‌కు అడ్డాగా మారిందని, ఇలాంటి కంటెంట్‌ను తొలగించడంలో టెలిగ్రామ్ యాప్ విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి. యాప్ ద్వారా టెర్రరిస్టులు తమ యాక్షన్ ప్లాన్లు సిద్ధం చేస్తున్నారంటూ గతంలోనే విచారణ సంస్థలు తేల్చాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా టెర్రరిస్టు గ్రూపులు ఈ యాప్ ద్వారా కమ్యునికేషన్ చేసుకుంటున్నాయనే అభియోగాలు ఉన్నాయి. చట్టాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో టెలిగ్రామ్ సీఈవో పావెల్ ఫ్రాన్స్ గతంలో అరెస్టు చేసింది. ఈ క్రమంలో యాప్‌ను బ్యాన్ చేసేందుకు పలు దేశాలు ఆలోచనలు చేస్తున్నాయి. అలాంటి వాటిలో భారత్ కూడా ఉంది. ఈ క్రమంలో తాజాగా దేశంలో జరిగిన పేలుడు ఘటన వెనుక యాప్ ప్రమేయం ఉందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

ఢిల్లీ కాకుంటే మరెక్కడా?:

జమ్ముకశ్మీర్ లో మిగతా ఉగ్రవాదులు అరెస్టు కావడం, దేశవ్యాప్తంగా తనిఖీలు పెరిగిన పరిణామాల వేళ భయాందోళనతోనే ఉమర్ ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అంటే ఈ ఆత్మాహుతి దాడి ప్లాన్ ప్రకారం జరగలేదని అర్థం అవుతోంది. ఒక వేళ ఈ ఉగ్రకుట్ర పోలీసులకు తెలియకపోయి ఉంటే ఉమర్ వద్ద ఉన్న పేలుడు పదార్థాలతో ఎక్కడ బ్లాస్ చేయాలని భావించారు అనేది ఆందోళన కలిగిస్తోంది. అనుకోకుండా జరిగిన పేలుడు వల్లే 12 మంది ప్రాణాలు పోయతే ఇక ప్లాన్ ప్రకారం దాడి చేసి ఉంటే ఆ విధ్వంసం ఎలా ఉండేదనేది ఊహించుకుంటేనే ఆందోళన కలిగిస్తోంది.

Read More... ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు.. NIAకు అప్పగింత

ఢిల్లీ పేలుళ్ల వెనుక జైషే-ఇ-మహ్మద్

Next Story