29 మండలాల గిరిజనులకు న్యాయం దూరం

by Ratna Kumari |

భద్రాచలం కేంద్రంగా పనిచేసిన మొబైల్ కోర్టును రద్దు చేయడంతో గిరిజనులు న్యాయం కోసం సుదీర్ఘకాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

29 మండలాల గిరిజనులకు న్యాయం దూరం
X

దిశ, భద్రాచలం : ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉప ప్రణాళికా ప్రాంతంలోని 29 మండలాల గిరిజనులకు సత్వర న్యాయం అందించేందుకు భద్రాచలం కేంద్రంగా పనిచేసిన మొబైల్ కోర్టును రద్దు చేయడంతో గిరిజనులు న్యాయం కోసం సుదీర్ఘకాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఆర్‌టీ నెం.70** ప్రకారం మొబైల్ కోర్టుల వ్యవస్థను రద్దు చేసి, సివిల్ న్యాయ పరిపాలన బాధ్యతలను ఆర్డీవోలు, సబ్‌కలెక్టర్లకు అప్పగించడంతో మారుమూల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఆర్డీవోలు, సబ్‌కలెక్టర్లు ఇతర పరిపాలనా బాధ్యతలతో బిజీగా ఉండటం వల్ల న్యాయ విచారణలకు తగిన సమయం కేటాయించలేకపోతున్నారని, దీంతో కేసుల పరిష్కారం ఆలస్యమవుతోందని విమర్శించారు. ఫలితంగా గిరిజనులు సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా, సామాజికంగా నష్టపోతున్నారని తెలిపారు.

మొబైల్ కోర్టును పునరుద్ధరించాలని వినతి..

మొబైల్ కోర్టును వెంటనే పునరుద్ధరించాలని భద్రాచలం బార్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం భద్రాచలం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొడాలి శ్రీనివాసన్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. మొబైల్ కోర్టు రద్దు రాజ్యాంగంలోని ఆర్టికల్–21 కల్పించిన సత్వర న్యాయం పొందే హక్కుకు విరుద్ధమని పేర్కొన్న వారు, జీఓ ఆర్‌టీ నెం.70ను రద్దు చేసి మొబైల్ కోర్టును తిరిగి ప్రారంభించాలని, గిరిజన ప్రాంతాల్లో న్యాయ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Next Story