మళ్లీ పెరిగిన ముడి చమురు ధరలు.. $90 దాటిన బ్రెంట్ క్రూడ్

by Malleboina Mahesh |

అంతర్జాతీయ మార్కెట్లో $90 దాటిన బ్రెంట్ క్రూడ్ ధర.. భారత్‌లో పెరిగిన ద్రవ్యోల్బణం భయాలు, 500 పాయింట్లకు పైగా కుప్పకూలిన సెన్సెక్స్!

మళ్లీ పెరిగిన ముడి చమురు ధరలు.. $90 దాటిన బ్రెంట్ క్రూడ్
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా, ఇరాన్ పరస్పర దాడులు, హార్మూజ్ జలసందిలో ఆంక్షలు, మూసివేత కారణంగా మరోసారి అంతర్జాతీయ మార్కెట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ముడి చమురు (Crude Oil) ధరలు ఒక్కసారిగా దూసుకు పోతుండటంతో భారత ఆర్థిక వ్యవస్థపై మళ్లీ ద్రవ్యోల్బణ భయాలు అలముకున్నాయి. అంతర్జాతీయ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ (Brent Crude) ధర బ్యారెల్‌కు ఏకంగా 90 డాలర్ల మార్కును దాటింది. గత వారం రోజుల్లోనే ఈ ధరలు దాదాపు 15.9 శాతం మేర పెరగడం గమనార్హం. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే భారత్‌కు చమురు దిగుమతుల భారం విపరీతంగా పెరిగి 'ఎనర్జీ షాక్' ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇది భారత రూపాయి విలువపై, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల (FPI) రాకపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ముడి చమురు ధరల పెరుగుదల భయాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం సోమవారం భారీ నష్టాలను చవిచూశాయి. గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి కారణంగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ (Sensex) ఏకంగా 500 పాయింట్లకు పైగా పతనమవ్వగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ (Nifty) 24,250 మార్కు కంటే దిగువకు పడిపోయింది. చమురు ధరల హెచ్చుతగ్గులు మరియు ద్రవ్యోల్బణ ఆందోళనల నేపథ్యంలో ఇన్వెస్టర్లు తీవ్ర అప్రమత్తత పాటిస్తుండటంతో మార్కెట్లు భారీ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

Next Story