- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కలెక్టరేట్ నిధుల దుర్వినియోగం పై క్రిమినల్ కేసు
జనగామ కలెక్టరేట్‌కు సంబంధించిన నిధుల నిర్వహణలో రూ.37.85 లక్షల విలువైన అనుమానాస్పద చెల్లింపులు గుర్తించినట్లు జిల్లా యంత్రాంగం ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

దిశ, జనగామ : జనగామ కలెక్టరేట్‌కు సంబంధించిన నిధుల నిర్వహణలో రూ.37.85 లక్షల విలువైన అనుమానాస్పద చెల్లింపులు గుర్తించినట్లు జిల్లా యంత్రాంగం ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అంతర్గత తనిఖీలు, భౌతిక పరిశీలన కమిటీ నివేదిక ఆధారంగా ఈ అంశం వెలుగులోకి వచ్చిందని పేర్కొంది. అధికారుల వివరాల ప్రకారం, ట్రెజరీ/పీఎఫ్ఎంఎస్ వ్యవస్థకు వెలుపల నిర్వహించిన ఒక బ్యాంకు ఖాతా నుంచి ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇతర సామగ్రి కొనుగోలు పేరుతో చెల్లింపులు జరిగినట్లు రికార్డులు ఉన్నాయని, అయితే భౌతిక తనిఖీలో ఆయా వస్తువులు గుర్తించలేదని, సంబంధిత కొనుగోలు రికార్డులు కూడా లభించలేదని వెల్లడించారు.
ఈ వ్యవహారానికి సంబంధించి ముగ్గురు కలెక్టరేట్ ఉద్యోగులను సస్పెండ్ చేసి, శాఖాపరమైన చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం ఫిర్యాదు మేరకు జనగామ టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నం.387/2026గా కేసు నమోదు చేసి, భారతీయ న్యాయ సంహిత–2023, ఐటీ చట్టంలోని సంబంధిత నిబంధనల కింద దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇదే ఖాతాల పరిశీలనలో గతంలో పదో తరగతి విద్యార్థుల కోసం కొనుగోలు చేసినట్లు చూపిన "దిక్సూచి" పుస్తకాల వ్యవహారంలో రూ.46.50 లక్షల చెల్లింపులకు సంబంధించిన అంశాలను కూడా సంబంధిత దర్యాప్తు సంస్థ దృష్టికి తీసుకెళ్లినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. అలాగే మరికొన్ని అనుమానాస్పద లావాదేవీలు కూడా దర్యాప్తు పరిధిలో ఉన్నాయని పేర్కొంది. దర్యాప్తు కొనసాగుతున్నందున నిందితుల పేర్లు, ఇతర వివరాలను ఈ దశలో వెల్లడించడం లేదని అధికారులు తెలిపారు. "ప్రజాధనానికి సంబంధించిన ప్రతి అంశాన్ని పూర్తిస్థాయిలో విచారించి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం" అని జిల్లా యంత్రాంగం పేర్కొంది.






