తెలంగాణ పెండింగ్ హామీలను వెంటనే అమలు చేయాలి: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

by Ajay Maddhiboyina |

పార్లమెంట్ సమావేశాల్లో దేశానికి, ప్రజలకు సంబంధించిన కీలక అంశాలపై సమగ్ర చర్చ నిర్వహించాలని భువనగిరి లోక్‌సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు.

తెలంగాణ పెండింగ్ హామీలను వెంటనే అమలు చేయాలి: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : పార్లమెంట్ సమావేశాల్లో దేశానికి, ప్రజలకు సంబంధించిన కీలక అంశాలపై సమగ్ర చర్చ నిర్వహించాలని భువనగిరి లోక్‌సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఆదివారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే విధంగా డీలిమిటేషన్ బిల్లును ముందుకు తీసుకురావద్దని, దీనిపై ముందుగా పార్లమెంట్‌లో విస్తృతంగా చర్చ జరగాలని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో పలు అంశాలపై చర్చకు ప్రభుత్వం ముందుకు రావాలని, అయోధ్యలో ప్రజల నుంచి వచ్చిన విరాళాల వినియోగంపై పార్లమెంట్‌లో చర్చ జరపాలన్నారు.

లడఖ్‌కు సంబంధించిన డిమాండ్లపై ఉద్యమిస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను బలవంతంగా ఆస్పత్రికి తరలించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు, వన్ నేషన్–వన్ ఎలక్షన్ ప్రతిపాదన, పెట్రోల్‌లో ఇథనాల్ వినియోగం వంటి అంశాలపై కూడా పార్లమెంట్‌లో సమగ్ర చర్చ నిర్వహించాలని ఆయన అభిప్రాయపడ్డారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజును ఈ అంశాలపై చర్చకు అవకాశం కల్పించాలని కిరణ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. భారత రాజ్యాంగ విలువలను దెబ్బతీసే ప్రయత్నాలు జరిగాయని, విదేశీ పర్యటనల కంటే దేశ ప్రజల సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణకు సంబంధించిన పెండింగ్ హామీలను వెంటనే అమలు చేయాలని, ప్రాంతీయ అవసరాల దృష్ట్యా రీజినల్ రింగ్ రోడ్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం ఇవ్వాలని కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. విభజన హామీలో భాగమైన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు తక్షణ ఆమోదం ఇవ్వాలని, మూసీ నది సుందరీకరణ, అర్బన్ ఛాలెంజ్ ఫండ్, తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు వంటి విభజన హామీలను అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిర్వహిస్తున్న సమావేశాలకు బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు హాజరు కాకపోవడం విచారకరమని, పదేళ్ల పాలనలో చేయని పనులపై సమాధానం చెప్పాల్సింది పోయి, కేటీఆర్ ప్రజలను తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు చేస్తున్నారని కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు.

Next Story