ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 10 లక్షల మంది విద్యార్థులకు ఉచిత ల్యాప్ టాప్‌లు

by Malleboina Mahesh |   (  Updated:2026-01-05 03:52:07  IST  )

అతి త్వరలో తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డిఎమ్‌కే ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై వారాల జల్లు కురిపిస్తుంది.

ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 10 లక్షల మంది విద్యార్థులకు ఉచిత ల్యాప్ టాప్‌లు
X

దిశ, వెబ్ డెస్క్: అతి త్వరలో తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డిఎమ్‌కే ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై వారాల జల్లు కురిపిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే రేషన్ కార్డుదారులకు సంక్రాంతి కానుకతో పాటు రూ. 3000 లను అందిస్తుంది. అలాగే ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని"ఉలగం ఉంగల్ కైయిల్" (ప్రపంచం మీ చేతుల్లో) అనే ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం స్టాలిన్ సిద్ధం అయ్యారు. ఈ రోజు ప్రారంభం కానున్న ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలల్లో చదువుతున్న సుమారు 10 లక్షల మంది కళాశాల విద్యార్థులకు ఉచితంగా లాప్ టాప్ లను పంపిణీ చేయనున్నారు.

విద్యార్థులను డిజిటల్ పరంగా బలోపేతం చేయడం, వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించేలా ప్రోత్సహించడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం కింద ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులను లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. వీరికి అందించే ల్యాప్ టాప్‌లు అత్యాధునిక ఫీచర్లతో రూపొందించబడ్డాయి. ఇవి ఇంటెల్ కోర్ ఐ3 (లేదా) ఏఎండీ రైజెన్ 3 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్, విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తాయి. వీటితో పాటు విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి అవసరమైన మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఇతర కోడింగ్ సాఫ్ట్‌వేర్లను కూడా ఇందులో ముందుగానే ఇన్‌స్టాల్ చేసి అందిస్తున్నారు.

రాబోయే రెండేళ్లలో మొత్తం 20 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్ టాప్ లను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం దాదాపు రూ. 2,000 కోట్లను కేటాయించారు. మొదటి విడతలో డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మరికొద్ది నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, యువతను ఆకట్టుకోవడంలో ఈ పథకం కీలకం కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఉన్న పాఠశాల విద్యార్థులకు ల్యాప్ టాప్ పథకాన్ని ఇప్పుడు ఉన్నత చదువులు చదివే కళాశాల విద్యార్థులకు వర్తింపజేస్తూ డీఎంకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Read More..

తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. బ్యాలెట్ పేపర్‌తోనే మున్సిపల్ ఎన్నికలు!

Next Story