- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెంగాల్ అభివృద్ధికి 'సిండికేట్' అడ్డంకి: కేంద్ర హోంమంత్రి అమిత్ షా
పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వంపై (Mamata Banerjee government) కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కోల్‌కతా పర్యటనలో ఉన్న ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెలకొన్న విపరీతమైన అవినీతి కారణంగా బెంగాల్ అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ఇక్కడి 'టోల్ సిండికేట్' (వసూళ్ల ముఠా)కు బలైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత 14 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్ పేరు చెప్పగానే భయం, అవినీతి మాత్రమే గుర్తుకు వస్తున్నాయని, ఇది రాష్ట్ర అస్తిత్వాన్ని దెబ్బతీస్తోందని ఆయన ధ్వజమెత్తారు.
అలాగే రాబోయే బెంగాల్ ఎన్నికల్లో మార్పు ఖాయమని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. 2026 ఏప్రిల్ 15 తర్వాత బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం (BJP Govt) ఏర్పడుతుందని ఈ సందర్భంగా ఆయన జోస్యం చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బెంగాల్ యొక్క పూర్వ వైభవాన్ని, గొప్ప సంస్కృతిని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ వ్యవస్థాపకుడైన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఈ గడ్డపై పుట్టిన గొప్ప నాయకుడని గుర్తు చేస్తూ.. 'బంగ భూమి' తమకు ఎంతో ముఖ్యమైనదని కొనియాడారు. మమతా దీదీ పాలనకు చరమగీతం పాడి, బెంగాల్‌ను మళ్ళీ ప్రగతిపథంలో నడిపిస్తామని ఆయన కార్యకర్తలకు ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో కంచె ఏర్పాటుకు భూమిని కేటాయించడంలో మమతా బెనర్జీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధ్వజమెత్తారు. ఈ అంశంపై తాను స్వయంగా ముఖ్యమంత్రికి 7 సార్లు లేఖలు రాశానని, గత ఆరేళ్లలో కేంద్ర హోం కార్యదర్శి మూడుసార్లు రాష్ట్ర పర్యటనకు వచ్చి ప్రధాన కార్యదర్శితో సమావేశాలు నిర్వహించారని ఆయన గుర్తు చేశారు. సరిహద్దు భద్రత కోసం భూమిని ఇవ్వడానికి తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వానికి ఉన్న భయం ఏమిటని, దేశ రక్షణ పట్ల వారికి బాధ్యత లేదా అని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలో చొరబాట్లు కొనసాగాలనే మమతా ప్రభుత్వం ఇలా చేస్తోందని అమిత్ షా ఆరోపించారు. బెంగాల్ ప్రభుత్వం ఈ చొరబాటుదారులకు అధికారిక పత్రాలను కూడా తయారు చేసి ఇస్తోందని, దీనివల్ల బెంగాల్ జనాభా నిష్పత్తి (Demography) ప్రమాదకరంగా మారిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చొరబాట్లను ఆపడంలో టీఎంసీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే దేశ భద్రతను పణంగా పెడుతున్నారని ఆయన విమర్శించారు.
Read More..
వార్షిక బడ్జెట్‌పై జనం కోటి ఆశలు.. కాసేపట్లో ఆర్థిక రంగ నిపుణులతో ప్రధాని భేటీ






