- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఎయిరిండియాకు రూ.1100కోట్ల బీమా సొమ్ము
అహ్మదాబాద్‌లో గతేడాది జూన్ 12న జరిగిన డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదానికి సంబంధించిన బీమా క్లెయిమ్‌లలో భాగంగా గ్లోబల్ రీ–ఇన్సూరెన్స్ సంస్థలు, భారతీయ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎయిర్ ఇండియాకు ఇప్పటివరకు సుమారు 125 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.1,125 కోట్లు) చెల్లించినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్‌లో గతేడాది జూన్ 12న జరిగిన డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదానికి సంబంధించిన బీమా క్లెయిమ్‌లలో భాగంగా గ్లోబల్ రీ–ఇన్సూరెన్స్ సంస్థలు, భారతీయ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎయిర్ ఇండియాకు ఇప్పటివరకు సుమారు 125 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.1,125 కోట్లు) చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం విమానం (హల్) ఇంజిన్ల నష్టానికి సంబంధించిన బీమా క్లెయిమ్‌గా చెల్లించబడినట్లు బీమా వర్గాలు వెల్లడించాయి. అలాగే ప్రమాదంలో మృతి చెందిన ప్రయాణికుల కుటుంబాలకు పరిహారంగా 25 మిలియన్ డాలర్లు (సుమారు రూ.225 కోట్లు) విడుదల చేసే ప్రక్రియను కూడా పూర్తిచేశారు. అయితే బాధిత కుటుంబాలకు పరిహారం అందింకే ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని, పూర్తి స్థాయిలో ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఈ మొత్తం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.
ఇంతకుముందు భారతీయ రీ–ఇన్సూరర్ జీఐసీ రీ (GIC Re) తెలిపిన ప్రకారం, ఈ ప్రమాదానికి సంబంధించిన ఎయిర్ ఇండియా మొత్తం క్లెయిమ్ విలువ సుమారు 475 మిలియన్ డాలర్లకు (రూ.4,275 కోట్లు) చేరే అవకాశముంది. ఇందులో 260 మంది మృతి చెందిన ఘటనకు సంబంధించి బాధ్యత పరిహారంగా మాత్రమే 350 మిలియన్ డాలర్లు ఉండనున్నాయి.
అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్‌కు వెళ్లాల్సిన AI-171 విమానం (బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్) అహ్మదాబాద్ సమీపంలో కూలి 260 మంది మృతి చెందారు. విమానం పూర్తిగా ధ్వంసమైంది. ప్రాథమికంగా చెల్లించిన 125 మిలియన్ డాలర్లలో 80 మిలియన్ డాలర్లు విమానం హల్ నష్టానికి, మరో 25 మిలియన్ డాలర్లు రెండు ఇంజిన్లకు సంబంధించినవి.
ఈ డీల్‌లో భాగస్వామ్యమైన ఒక రీ–ఇన్సూరర్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదానికి ముందు విమానానికి ఇంజిన్ మెయింటెనెన్స్ జరిగిందని, తాత్కాలికంగా కొత్త ఇంజిన్ అమర్చారని చెప్పారు. పాత ఇంజిన్ ఇప్పుడు బీమా సంస్థల స్వాధీనంలోకి వచ్చిందని, దానిని అమ్మి కొంత మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం ఉందన్నారు. హల్, ఇంజిన్లకు సంబంధించిన క్లెయిమ్‌లు ఇప్పటికే సెటిల్ అయ్యాయని, ప్రయాణికుల పరిహార క్లెయిమ్‌లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ అంశంపై స్పష్టత కోరుతూ ఎయిర్ ఇండియాకు ఒక నేషనల్ మీడియా సంస్థ ఈమెయిల్ పంపగా.. దానిపై స్పందన లేదని పేర్కొంది.
ఈ ప్రమాదానికి సంబంధించిన ఎయిర్ ఇండియా బీమా క్లెయిమ్ విమాన బీమా చరిత్రలోనే అతిపెద్ద క్లెయిమ్‌లలో ఒకటిగా మారింది. ఏప్రిల్ 1 నుంచి ఎయిర్ ఇండియా తన 20 బిలియన్ డాలర్ల హల్ బీమా పాలసీ, 1.5 బిలియన్ డాలర్ల లయబిలిటీ పాలసీని అమెరికాకు చెందిన AIG నేతృత్వంలో పునరుద్ధరించింది. ఈ పాలసీలో దాదాపు 95 శాతం వరకు రీ–ఇన్సూరెన్స్ చేయబడింది. ప్రాథమిక బీమా సంస్థల్లో టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ 40 శాతం వాటాతో ముందుండగా, న్యూ ఇండియా అష్యూరెన్స్ తదితర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కూడా భాగస్వాములయ్యాయి. అయితే రీ–ఇన్సూరెన్స్ ఎక్కువగా ఉండటంతో ప్రాథమిక సంస్థలపై భారం తక్కువగా ఉంటుందని వర్గాలు చెబుతున్నాయి.
Read More..






