- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళ సంస్కృతిని కాపాడుకుందాం.. కన్యాకుమారిలో రాహుల్ గాంధీ
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీ, అన్నాడీఎంకే కూటమిపై నిప్పులు చెరిగారు.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీ, అన్నాడీఎంకే కూటమిపై నిప్పులు చెరిగారు. సోమవారం కన్యాకుమారిలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, తమిళనాడు ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాలకుల చేతుల్లో పెట్టవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తమిళనాడులో ఉన్న అన్నాడీఎంకే (AIADMK) స్వతంత్రంగా వ్యవహరించడం లేదని, అది కేవలం బీజేపీకి ఒక పావుగా మారిందని రాహుల్ విమర్శించారు. మీరు చూస్తున్నది అన్నాడీఎంకే జెండా కావచ్చు, కానీ దాని వెనుక ఉన్నది నరేంద్ర మోడీ, అమిత్ షా మాత్రమే. అన్నాడీఎంకేను అడ్డం పెట్టుకొని తమిళనాడుపై పట్టు సాధించాలని బీజేపీ డ్రామాలాడుతోంది అని ఆయన మండిపడ్డారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ (RSS) సిద్ధాంతాలు ద్రవిడ సంస్కృతికి, తమిళ భాషకు పూర్తి వ్యతిరేకమని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.
కుట్రలు..
తమిళనాడులో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ కుట్రలు చేస్తోందని, అందుకోసం విభజన రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే శక్తులకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలను కోరారు. తమిళుల భవిష్యత్తును తమిళులే నిర్ణయించుకోవాలి తప్ప, ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశాలు కాదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని కూటమి తమిళ సంస్కృతిని, భాషను రక్షించడంలో ముందుంటుందని రాహుల్ భరోసా ఇచ్చారు. బీజేపీ అహంకారానికి, తమిళుల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటమే ఈ ఎన్నికలని ఆయన అభివర్ణించారు. కన్యాకుమారి సభకు పోటెత్తిన జనాలను చూస్తుంటే తమిళనాడులో మార్పు ఖాయమని, బీజేపీ-అన్నాడీఎంకే కూటమికి పరాభవం తప్పదని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు.






