ఉగ్రవాద రిక్రూట్‌మెంట్ కేసులో కీలక నిందితుడికి 10 ఏళ్ల శిక్ష: NIA కోర్టు తీర్పు

by Ramesh Naini |   (  Updated:2026-01-22 05:25:17  IST  )

పశ్చిమ బెంగాల్‌లో యువతను ఉగ్రవాదం వైపు మళ్లించి, నిషేధిత లష్కరే తోయిబా (LeT) సంస్థలోకి రిక్రూట్ చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక నిందితుడికి ఎన్ఐఏ (NIA) ప్రత్యేక కోర్టు బుధవారం శిక్ష ఖరారు చేసింది.

ఉగ్రవాద రిక్రూట్‌మెంట్ కేసులో కీలక నిందితుడికి 10 ఏళ్ల శిక్ష: NIA కోర్టు తీర్పు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లో యువతను ఉగ్రవాదం వైపు మళ్లించి, నిషేధిత లష్కరే తోయిబా (LeT) సంస్థలోకి రిక్రూట్ చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక నిందితుడికి ఎన్ఐఏ (NIA) ప్రత్యేక కోర్టు బుధవారం శిక్ష ఖరారు చేసింది. పాకిస్తాన్ ముఠాతో సంబంధాలు ఉన్న ఈ కేసులో నిందితుడు సయ్యద్ ఎం. ఇద్రిస్‌కు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 70,000 రూపాయల జరిమానా విధిస్తూ కోల్ కతాలోని ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఈ వివరాలను ఎన్ఐఏ గురువారం ఎక్స్ వేదికగా వెల్లడించింది. వివరాల ప్రకారం.. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన సయ్యద్ ఎం. ఇద్రిస్‌పై భారత శిక్షాస్మృతి (IPC),చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద పలు సెక్షన్ల ప్రకారం అభియోగాలు నమోదయ్యాయి. ఏప్రిల్ 2020లో పశ్చిమ బెంగాల్ పోలీసుల నుంచి ఈ కేసును స్వీకరించిన ఎన్ఐఏ, దర్యాప్తులో భాగంగా ఇద్రిస్‌తో పాటు జమ్మూ కాశ్మీర్‌కు చెందిన అల్తాఫ్ అహ్మద్ రాథర్‌ను అరెస్ట్ చేసింది.

దర్యాప్తులో తేలిన నిజాలు..

నిందితులు ఇద్దరూ తానియా పర్వీన్ అనే మహిళతో కలిసి స్థానిక యువతను ఉగ్రవాద సంస్థలోకి చేర్చుకోవడానికి ఒక ముఠాగా ఏర్పడ్డారని దర్యాప్తులో తేలింది. 2020 మార్చిలో పశ్చిమ బెంగాల్ ఎస్టీఎఫ్ (STF) జరిపిన తనిఖీల్లో తానియా పర్వీన్ వద్ద జిహాదీ సాహిత్యం, ఇతర అభ్యంతరకర పత్రాలు లభ్యమయ్యాయి. సోషల్ మీడియా వేదికగా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువతను రెచ్చగొట్టి, జిహాద్ పేరుతో వారిని తీవ్రవాదం వైపు మళ్లించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు.

పరారీలో ఉన్న నిందితులు..

ఈ కేసులో 2020, 2021 సంవత్సరాల్లో ఎన్ఐఏ అభియోగపత్రాలు (Chargesheets) దాఖలు చేసింది. కాగా, పాకిస్తాన్‌కు చెందిన ఆయేషా (అలియాస్ ఆయేషా బుర్హాన్), బిలాల్ (అలియాస్ బిలాల్ దురాని) అనే ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరిపై ఇప్పటికే రెడ్, బ్లూ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. కేసులో మిగిలిన నిందితులపై విచారణ కొనసాగుతోంది.

Read More..

రిపబ్లిక్ డే వేళ ‘26-26’ కోడ్ నేమ్ తెరపైకి.. భీకర దాడులకు జైషే మహ్మద్‌ కుట్ర

Next Story